వేటు పడేముందు మేలుకున్నారు గానీ..

ఒక తప్పు జరుగుతున్నదీ అంటే.. ఆ తప్పును ప్రపంచం మొత్తం గుర్తించడానికి కాస్త ఆలస్యం కావొచ్చు గాక..! కానీ ఆ తప్పు చేస్తున్న వ్యక్తికి ప్రారంభం నుంచి తెలుసు. ఏపీలోని పోలీసు అధికారుల సంగతి కూడా అంతే. తాము అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ముకాస్తున్నామని, ఆ పార్టీ నాయకుల ఆదేశాలకు శిరసువొగ్గి పనిచేస్తున్నామనే సంగతి అందరికంటె ముందు, అందరికంటె బాగా వారికే తెలుసు! తమ చాటుమాటు బంధం బయటపడిపోతున్న సమయంలో.. ఇక తమ మీద వేటు పడబోతున్నదని కూడా అర్థమైన తరుణంలో కాస్త జాగ్రత్త పడాలని ప్రయత్నించారు గానీ.. వారు అనుకున్నట్టుగా జరగలేదు. ఈసీ వేటు పడనే పడింది.

పోలింగ్ అనంతరం కూడా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగడానికి బాధ్యులుగా భావించిన ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టరుపై ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టరు శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ లను బదిలీ చేసింది. పల్నాడు ఎస్పీ బిందుబాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ లను ఏకంగా సస్పెండ్ చేసేసింది. కిందిస్థాయిలోని 12 మంది అధికారులపై కూడా చర్య తీసుకున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే.. తమ మీద వేటుపడబోతున్నదనే సంగతి ఈ అధికారులకు ముందే అర్థమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీని, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినప్పుడే.. ఈ అధికారులకు ఏం జరగబోతున్నదో అర్థమైపోయింది. కాస్త జాగ్రత్త పడ్డారు.

పల్నాడులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వైసీపీ నాయకుల ఇళ్లలో పెద్దసంఖ్యలో పెట్రోలు బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా తిరుపతిలో కూడా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని మీద హత్యాయత్నం చేసిన నిందితులు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏదో సినిమాటిగ్గా ఉన్నతాధికారుల మీద వేటు పడబోతున్న సమయంలోనే.. వారు జాగ్రత్త పడి వైసీపీ వారికి వ్యతిరేకంగా తనిఖీలు, అరెస్టు చేయడం నాటకీయంగానే కనిపిస్తోంది.

ఇంత చేసినా కూడా వారు వేటు తప్పించుకోలేకపోయారు. సాయంత్రానికి ఈ అధికారుల మీద ఎన్నికల సంఘం వేటు వేసేసింది. వారి మీద శాఖపరమైన విచారణ జరగాలని, శుక్రవారం నాడే చార్జిషీట్ కూడా దాఖలు కావాలని ఈసీ చాలా సీరియస్ గా ఆదేశించింది. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories