జగన్ మేకపోతు గాంభీర్యం!.. వెనక వరసలో చూశారా?!

పోలింగ్ పూర్తయి మూడు రోజుల తర్వాత గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాహ్య ప్రపంచంలోకి రావడానికి ధైర్యం చిక్కలేదు. పోలింగ్ పూర్తయిన రోజున కనీసం ప్రజలకు థాంక్స్ చెప్పడానికి కూడా తన తరఫున సజ్జల రామకృష్ణారెడ్డిని  పురమాయించి పంపిన జగన్, సోమవారం పోలింగ్ జరిగితే గురువారం నాటికి కాస్త ధైర్యం చిక్కబట్టుకున్నారు. ఇప్పటికీ పార్టీ నాయకులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఫేస్ చేసే ధైర్యం లేదు. తను ఏం మాట్లాడినా కేరింతలు కొట్టే కుర్రకారు ఉన్న ఐప్యాక్ సమావేశానికి మాత్రం ఆయన హాజరయ్యారు.

శుక్రవారం యూరోప్ యాత్రకు వెళ్లే ముందు ఐప్యాక్ ప్రతినిధుల సమావేశానికి వెళ్లి, వారికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కానుకలు కూడా అందించారు జగన్మోహన్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే ఐదేళ్లపాటు కూడా కలిసి పనిచేయాలని ఆయన వారితో అన్నారు. తద్వారా అధికారంలోకి రాకపోతే వారి సేవలకు ఇక్కడ భరత వాక్యం పలుకుతున్నట్లు లెక్క.

గత ఎన్నికలలో తమ పార్టీకి 151 సీట్లు వచ్చాయని, ఈసారి జనం ఓట్లు వేసిన తీరు గమనిస్తుంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని అర్థమవుతుందని.. ఎంపీ సీట్లు కూడా 22 కంటే ఎక్కువ సాధించబోతున్నామని జగన్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

మేకపోతు గాంభీర్యం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం అని ఆర్భాటంగా ఒక తన ముద్రగలిగిన చిరునవ్వు నవ్వుతూ ప్రకటించారు. ఆయన ప్రకటనకు అక్కడ ఉన్న వారందరూ కేరింతలు కొడుతూ హర్షద్వానాలు చేశారు. అయితే అత్యంత కీలకమేంటంటే.. జగన్ వెనుక వరుసలో ఉన్న వారి మొహాలను కూడా గమనించాలి.

జగన్ వెనుక వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ నిలుచున్నారు. జగన్ తో పాటు ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవబోతున్న నాయకులు వాళ్లు. అయితే జగన్ తన విజయదరహాసంతో సాధించబోయే సీట్ల సంఖ్యను ప్రకటిస్తున్నప్పుడు, ప్రశాంత్ కిషోర్ అంచనాలకు అందకుండా సీట్లు దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ ఉండదు అంతా టీం చేసే పనే అని అక్కడివారిని ప్రోత్సహిస్తున్నప్పుడు సభ మొత్తం నవ్వులు కేరింతలు ధ్వనిస్తున్నాయి గాని.. ఆ ఇద్దరు కీలక నాయకుల మొహంలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు! బొత్స సత్యనారాయణ ప్రారంభం నుంచి చివరి వరకు మొహం మార్చుకుని సీరియస్ గానే ఉన్నారు.

కనీసం జగన్ సీట్ల సంఖ్యను ప్రకటిస్తున్నప్పుడు చిన్న ఆనందం కూడా ఆయన మొహంలో లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మొహం వేళ్లాడేసుకుని దిగాలుగా కనిపించారు. గెలుపు పట్ల తన పార్టీ కీలక నాయకులలో మినిమం నమ్మకాన్ని కలిగించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ వారితో మాత్రం చాలా ఘాటుగా గెలుపు ప్రస్తావన చేయడం మేకపోతు గాంభీర్యమే అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు!

Related Posts

Comments

spot_img

Recent Stories