ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజలు అంటే చాలా ప్రేమ! కనీసం తాను ప్రేమ కురిపించడానికి అయినా సరే రాష్ట్రంలో పుష్కలంగా పేదలు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు! ప్రజలను ఉద్దేశించి ఆయన చేసే సంబోధన కూడా చాలా చిత్రంగా ఉంటుంది. అదే తరహాలో సోమవారం నాడు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుండగా.. జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ తప్పకుండా కదిలి వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ఆయన పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు కూడా సభలలో ఆయన ప్రసంగం మాదిరిగానే నాటకీయంగా సాగిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే పోలింగ్ ముగిసిన తర్వాత ఓటు వేసిన రాష్ట్ర ప్రజలకు కనీసం థాంక్స్ చెప్పడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఐదు నిమిషాల సమయం లేదా అని ప్రజలు విస్తుపోతున్నారు.
‘‘నా అవ్వాతాతలు అందరూ.. నా అక్క చెల్లెమ్మలందరూ.. నా అన్నదమ్ములందరూ.. నా రైతన్నలందరూ.. నా యువతీ యువకులు అందరూ.. నా ఎస్సీ.. నా ఎస్టి.. నా బీసీ.. నా మైనారిటీలందరూ.. అందరూ కదలిరండి తప్పకుండా ఓటు వేయండి’’ అని జగన్ ఉదయాన్నే ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఓటర్లలో ఆ మేరకు చైతన్యం కలిగించడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి! ఆయన పిలుపునకే స్పందించి ఓటర్లంతా అనేక కష్టనష్టాలకు ఓర్చి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేశారని అనుకుందాం. మరి అలాంటప్పుడు ప్రజలకు థాంక్స్ చెప్పడం కూడా నాయకుడుగా ఆయన బాధ్యత కదా! పోలింగ్ ముగిసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి కదా! అని ప్రజల ప్రశ్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాంటి పని సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. పోలింగ్ సరళి మీద వ్యాఖ్యానించడానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందని సభ్యుల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం అధిక పోలింగ్ అధికార పార్టీని ఓడిస్తే, ఈసారి అధిక పోలింగ్ అధికార పార్టీని మళ్ళీ గెలిపిస్తుంది అన్నారు. ఆయన ప్రెస్ మీట్ మొత్తం తెలుగుదేశం పార్టీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని ఆరోపించడానికి సరిపోయింది. పోలీసులు కూడా తెలుగుదేశంతో కుమ్మక్కై రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి సహకరించారని, సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన మాటలు గమనిస్తే ఓడిపోయిన తర్వాత చెప్పుకోవాల్సిన కారణాలను ఇప్పుడే తయారు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
ఆ గొడవ పక్కన పెడితే ఇన్నాళ్లు పేద ప్రజలను ఇంతగా ప్రేమించానని చెప్పుకునే జగన్.. పోలింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్న నేపథ్యంలో.. ఆ ప్రజలకు థాంక్స్ చెప్పడానికి జగన్ కు సమయం లేదా? ఇంత కష్టపడి ప్రజలంతా వచ్చి ఆయనకు ఓట్లు వేస్తే కనీసం ధన్యవాదాలు చెప్పలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు! లేదా, ఓటమి ఖరారు అని అంచనాకు రావడంతో ప్రజల ఎదుటకు రాలేక మొహం చాటేస్తున్నారా? అని అంటున్నారు.