పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించడం కోసం.. ఆయనను, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానించే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ముందుకు వచ్చింది. రకరకాల కారణాల రీత్యా కొందరు బయటపడి ఏమీ మాట్లాడలేదు. కానీ.. చాలా మంది హీరోలు పవన్ కల్యాణ్ ను పిఠాపురం ప్రజలు ఘనంగా గెలిపించాలని.. తమ తమ సోషల్ మీడియా వేదికల మీద పిలుపు ఇచ్చారు. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆయనకు దన్నుగా నిలిచింది. అయితే ప్రచారంలో చివరి రోజు అయిన శనివారం నాడు.. రామ్ చరణ్ కూడా తన బాబాయి పవన్ కల్యాణ్ కు మద్దతుగా తల్లితో కలిసి నియోజకవర్గానికి రావడం అభిమానులను మరింతగా ఉత్సాహపరిచింది. అలాగే మెగా కుటుంబం మద్దతు గురించి.. దుర్మార్గమైన ప్రచారానికి దిగజారిన వైసీపీ సోషల్ మీడియా దళాలకు కళ్లెం పెట్టేసింది.
పవర్ స్టార్ విజయం కోసం ఆయన కుటుంబం పూర్తిస్థాయిలోనే పనిచేసిందని చెప్పాలి. రెండో అన్నయ్య నాగబాబు.. పిఠాపురంలోనే తిష్ఠవేసి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన కొడుకు హీరో వరుణ్ తేజ్ బాబాయి కోసం ప్రచార సభలు, రోడ్ షో లు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశాన్ని ప్రత్యేకంగా విడుదల చేస్తూ.. ప్రజాసేవకోసం పవన్ కల్యాణ్ ఎంతగా పరితపించే వ్యక్తో, ఆయనను గెలిపించడం సమాజానికి ఎలా మేలుచేస్తుందో వివరించారు. అయితే రాంచరణ్ మాత్రం ఎన్నికల ప్రచారానికి రాలేదని.. నీలిమీడియా రకరకాల దుష్ప్రచారాలు ప్రారంభించారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతూ.. రాంచరణ్ కూడా.. పిఠాపురం వచ్చారు. అలాగే అల్లు ఫ్యామిలీతో కూడా విభేదాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. దానికి విరుగుడుగా అల్లు అరవింద్ కూడా పిఠాపురం వచ్చి పవన్ కు మద్దతు తెలిపారు.
యూత్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న రాంచరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి అక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. తర్వాత పవన్ ఇంట్లో బాబాయిని కలిసి వేల సంఖ్యలో అక్కడ గుమికూడిన ప్రజలను ఉద్దేశించి అభివాదం చేశారు. బాబాయ్ అబ్బాయ్ లను కలిసి చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారపర్వంలో చెర్రీ రాక అనేది విన్నింగ్ షాట్ లాంటిదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.