ఏపీకి పోటెత్తుతున్న వలసజీవులు :సంకేతం ఏంటి?

ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 13వ తేదీ సోమవారం జరగబోతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎంతమాత్రమూ ప్రత్యేకం కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణలోనూ, ప్రత్యేకించి హైదరాబాదులోను లక్షల సంఖ్యలో సెటిలై ఉండే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజలంతా ఇప్పుడు కట్టగట్టుకుని సొంత రాష్ట్రానికి వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి అన్ని రహదారులు కూడా దారుణంగా స్తంభించి పోతున్నాయి. టోల్ గేట్ ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్సులు రద్దీ చెప్పనలవి కాకుండా ఉంది. రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

హైదరాబాదు నుంచి ఏపీకి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. సంక్రాంతికి, దసరాకు తెలంగాణలో ఉన్న ఏపీ వాసులంతా ఒక్కుమ్మడిగా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయినట్టుగా ఈ ఎన్నికల సమయంలో కూడా పోటెత్తుతున్నారు. జనం ఇంతగా వెల్లువగా ఓటు వేయడం కోసం తరలి వెళ్లడం లోని అంతరార్థం, మర్మం, సంకేతం ఏమిటి? ఇంత వెల్లువగా జనం ఏపీకి తరలి వెళ్తుండడం ఏ పార్టీకి సానుకూల అంశంగా భావించాలి. దీని గురించే రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ విపరీతంగా చర్చ జరుగుతోంది.

హైదరాబాదులో ఉంటున్న ఏపీ సెటిలర్లు అందరూ కూడా తెలుగుదేశం వారేనని, అదంతా చంద్రబాబునాయుడు ఓటు బ్యాంకే అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ కు ఒక దురభిప్రాయం ఉంది. వారిని ఆయన తన రాష్ట్ర ప్రజల్లాగా కాకుండా తెలుగుదేశం వారిగానే చూస్తుంటారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు హైదరాబాదు నుంచి వెల్లువలా ఐటీ ఉద్యోగులు పరామర్శ నిమిత్తం రాజమండ్రికి వెళ్లాలనుకుంటే.. సరిహద్దుల వద్ద శత్రుదేశంలోకి ఎంటరవుతున్న తరహాలో ఎలాంటి బందోబస్తుతో వారినందరినీ హింసించారో అందరికీ తెలుసు.

ఏది ఏకమైనప్పటికీ.. హైదరాబాదులో స్థిరపడిన ఏపీ వారిలో, ప్రత్యేకించి ఐటీ ఉద్యోగుల్లో చంద్రబాబు పట్ల ఎంతో భక్తి భావం ఉంటుంది. హైదరాబాదు నగరం తమకు ఉపాధి కల్పించి జీవితాన్ని ప్రసాదించింది అంటే.. ఆ అభివృద్ధికి మూలకారణం చంద్రబాబునాయుడే అన్న భావన వారికి ఉంది. దానికి తగ్గట్టుగానే హైదరాబాదులో సెటిలైన ఏపీ వారి మీద జగన్ కు కూడా కక్ష ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ నుంచి ఓటర్లు ఏపీకి పోటెత్తి వెళ్లడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎడ్వాంటేజీ అవుతుందని పలువురు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, ఏపీకి అయిదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా రానివ్వని, ఉన్నవాటిని వెళ్లగొట్టిన జగన్ పాలన కొనసాగితే.. ఇక అసలు సంవత్సరానికి ఒక్కసారైనా తమ స్వస్థలాలకు వెళ్లే ఆశ అడుగంటిపోతుందనే భయంతోనే వారు ఇలా వెల్లువలో ఓటు కోసం వెళుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories