కూటమి నిఘా బృందాలు ‘సీవిజిల్’తో సిద్ధం!

ఎన్నికల ప్రచార పర్వం దాదాపుగా ముగిసిపోతున్నట్టే. శనివారం సాయంత్రానికి ఇక ప్రచారానికి తెరపడిపోతుంది. శుక్రవారం నుంచే ఓట్ల కొనుగోలుకు సంబంధించిన బేరసారాలు.. ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసే సకల అరాచకమైన కుట్రలకు ఇప్పుడే తెరలేస్తుంటుంది. ఓట్ల కొనుగోలుకు నాయకులు నోట్ల కట్టలను బయటకు తీసే సమయం ఇదే! అయిదేళ్లు పాటు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి తెగించిన అధికార పార్టీ నాయకులు.. ఎంతపెద్ద మొత్తమైనా సరే చెల్లించి ఓట్లను కొనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ప్రజల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీయే కూటమికి చెందిన నిఘా బృందాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఈ మూడురోజుల పాటూ కంటి మీద కునుకులేలకుండా వంతుల వారీ బృందాలుగా క్షేత్రస్థాయిలో ప్రతి గల్లీలోనూ పనిచేస్తూ.. ఎక్కడ ఎలాంటి అరాచకం కంటపడినా సరే.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సీవిజిల్ యాప్ తో సహా.. ఎన్నికల అరాచకాలను, డబ్బు పంపిణీ బాగోతాలను కట్టడి చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు.

గత ఎన్నికల సమయంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్క ఓటుకు వెయ్యి, రెండు వేల రూపాయలు వంతునపెట్టి కొని గెలిచారని అప్పట్లో బాగా వినిపించింది. గెలిచిన నాటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇసుక దందాలు, లిక్కర్ దందాల రూపేణా విచ్చలవిడిగా దోచుకుంటూ వచ్చారు. పేదలకు సెంటు భూమి వంతున ఇళ్లస్థలాలు కేటాయించిన బాగోతంలో.. ఎమ్మెల్యేలు పదుల కోట్ల రూపాయలు కాజేశారు. ఇవన్నీ అందరికీ తెలిసిన రహస్యాలే. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి అధికార పార్టీ వారు సిద్ధంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న సమచారాన్ని బట్టి.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి 50-60 కోట్ల రూపాయలు అయినా ఖర్చు పెట్టి గెలవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా క్షేత్రస్థాయిలో గ్రామాలకు, చిన్న స్థాయినాయకుల వద్దకు డబ్బు కట్టలను ఇప్పటికే చేరవేసినట్టుగా కూడా తెలుస్తోంది.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తమ పార్టీకి ఖరారుగా పడే ఓట్లకు ఎంతో కొంత ముట్ట జెబుతూ.. ప్రతి నియోజకవర్రగంలో కనీసం లక్ష కొనాలనేది వారి ప్లాన్ గా ఉంది. వాటికి అథమం రెండు వేల నుంచి గరిష్టంగా.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓటర్లే అయితే గనుక.. అయిదువేల రూపాయలవరకు ఇచ్చివారి ఓట్లు వేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అయితే అధికార పార్టీ వారి ఈ దుర్మార్గాలను ఎక్కడికక్కడ అరికట్టడానికి సీవిజిల్ యాప్ తో సహా కూటమి పార్టీల కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి సిద్ధంగా ఉన్నారు. సీవిజిల్ ద్వారా నేరుగా ఎన్నికల అధికారులకు లైవ్ లోనే ఫిర్యాదు అందుతుంది. ఎక్కడ అరాచకం జరుగుతోందో జియో ట్యాగింగ్ ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. అధికార పార్టీ వారి దుర్మార్గాలను కొంతమేరకైనా అరికట్టాలని వీరు ప్రయత్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories