ముందే చేతులెత్తేసిన జగన్

అధికారులు బదిలీ అనేది కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం అని ఎన్నికల నిర్వహణ స్వచ్ఛంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేకుండా పోతోంది.. అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. తన తొత్తులు అధికారంలో ఉంటే తప్ప ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు కాదు- అని ఆయన భావిస్తున్నారో ఏమో తెలియదు! అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న వారిని తప్పించి వేరే అధికారులను నియమిస్తూ ఉంటే- ఎన్నికల నిర్వహణ దారి తప్పి పోతున్నదని వ్యాఖ్యానిస్తున్న ఈ ముఖ్యమంత్రి- ఓటమి ఖరారు అని అర్థమై, ముందుగానే ఇలాంటి డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినాసరే.. అప్పటికి ఉన్నతాధికారులుగా ఉన్నవారిని ఈసీ తొలగించేస్తుంది. వారి స్థానంలో న్యూట్రల్ గా ఉంటారనే పేరున్న ఇతర అధికారుల్ని నియమించి.. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతున్నదనే భావనను ప్రజలకు కలిగిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజల్లో గౌరవం పెంచుతుంది. ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం. అయితే.. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్నాళ్లూ తమకు అత్యంత విధేయులుగా ఉండే అధికారుల్ని మాత్రమే కీలకపదవుల్లో నియమించుకుంటూ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొన్ని వారాల ముందు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికార్లు చాలా మందిని బదిలీచేశారు. ఎంత టూమచ్ గా విధేయతకు ప్రాధాన్యం ఇచ్చారంటే.. ఒకటిరెండు జిల్లాల ఎస్పీల విషయంలో పోస్టింగ్ అయి వారం రోజులు కూడా గడవక ముందే.. అక్కడ స్థానికంగా తమ పార్టీ నాయకులకు విధేయత చూపించలేదని, వారి అడుగులకు మడుగులొత్తలేదని కొందరు ఎస్పీలను మార్చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలుగా అంతా తమ విధేయులను నియమించారనే ఆరోపణలున్నాయి.

కోడ్ వచ్చిన తర్వాత.. అలాంటి అధికారులు దారి తప్పి వ్యవహరిస్తోంటే.. ఎన్నికల సంఘం వేటు వేస్తున్నది.అనేకమంది ఎస్పీలు, డీఐజీలు, కమిషనర్ ఇలా పలువురు బదిలీ అయ్యారు. ఎన్నికల ప్రచారపర్వంలో జరుగుతన్న అల్లర్లను అదుపుచేయడంలో, శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు రాష్ట్రమంతా విపలమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కూడా ఈసీ మార్చేసింది.
తన వీరభక్తుడైన వ్యక్తి డీజీపీ పదవిలో లేకపోయేసరికి జగన్ కు భయం పుట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఆయన  అసలు ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదని వ్యాఖ్యానిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని పదవుల్లో విధేయుల్ని కూర్చోబెట్టిన వ్యక్తి, డీజీపీని మార్చగానే ఇలాంటి అల్లరి చేయడం ఆయనలోని ఓటమి భయం వల్లనేనని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories