వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఈ అయిదేళ్లు ప్రభుత్వ కాలంలో మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఒకటిరెండు కూడా లేవు. ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులతో మాట్లాడడం, ప్రభుత్వ పురోగతికి సంబంధించిన విషయాలను వారితో పంచుకోవడం అంటే ఆయనకు భయం. వారు ఏప్రశ్న వేస్తే.. తాను ఏం సమాధానం చెప్పేస్తానో.. ఎక్కడ ఇరుక్కుపోతానో అనేది ఆయన భయం. అయినా సరే.. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో అవసరం ఆయనది గనుక.. లోకల్ మీడియా అంటే అహంకారంతో కూడిన చిన్నచూపు గనుక.. జాతీయ మీడియా చానెల్లకు ఆయన రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీడియా ప్రశ్నలకు ఎంతగా తడబడతారో.. కంగారు పడతారో.. అడ్డగోలు సమాధానాలు చెబతారో.. ఈ ఇంటర్వ్యూల్లో అడ్డంగా దొరికిపోయారు.
షర్మిల రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి, జగన్ అవకాశం ఇవ్వకపోవడం వల్లనే.. ఆమె సొంత పార్టీ ప్రయత్నం, అది బెడిసిన తర్వాత ఏపీసీసీ చీఫ్ గా అన్నతోనే పోటీపడుతుండడం గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగారు. జగన్ ఈ ప్రశ్నకు చిత్రమైన సిద్ధాంతం చెప్పారు. ‘రాజకీయాల్లో ఒక తరంలో ఒక వ్యక్తే లీడ్ చేయాలి. మిగతా వాళ్లు సపోర్టింగ్ కేరక్టర్లుగా ఉండాలి. ఒక జనరేషన్ నుంచి ఎంతమంది వస్తారు? అందుకే నా చెల్లెల్ని రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను.. వ్యాపారం చేసుకోవాలని సపోర్టుచేస్తానని చెప్పాను’ అని జగన్ చెప్పుకున్నారు.
సాధారణంగా ఎవరైనా ఇలాంటి నీతులు మాట్లాడితే ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు మాత్రమే రావాలి.. అందరికీ అవకాశాలు దక్కాలి కదా అని అంటూ ఉంటారు. కానీ.. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కొక్క ఫ్యామిలీనుంచి అనేకమందికి టికెట్లు కట్టబెట్టిన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అనగల ధైర్యం లేదు. కానీ.. ఒక తరంలో ఒకే వ్యక్తి రాజకీయాలను లీడ్ చేయాలి అంటూ ఆయన చెబుతున్న సొంత సిద్ధాంతం కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే.. ఆయన సొంత కుటుంబంలోనే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, చిన్నాన్న వివేకానందరెడ్డి ఒకే తరంలో రాజకీయాలు నడిపారు. ఈ సిద్ధాంతం నేను నా పార్టీకోసం తయారు చేసుకున్నది అని జగన్ సమర్థించుకోవచ్చు. అప్పటికీ ఆయన డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నట్టే లెక్క.
పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న ద్వారకనాధ్ రెడ్డి ఇద్దరూ అన్నదమ్ములేకదా.. వారిద్దరూ వేర్వేరు తరాలకు చెందినవ్యక్తులు కాదు కదా..? అనేది జనం ప్రశ్న. పైగా ఇదే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి రెండో మిథున్ రెడ్డికి కూడా టికెట్ ఇచ్చారు. అలాగే బొత్స కుటుంబం కూడా. చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం ఎంపీగా బరిలో ఉన్న ఆయన భార్య ఝాన్సీ వేర్వేరు తరాలకు చెందిన వ్యక్తులు కాదు కదా? వీరెవ్వరికీ వర్తించని జగన్మోహన్ రెడ్డి ఆధునిక రాజకీయ నీతుల సిద్ధాంతం.. తన సొంత చెల్లెలు షర్మిలకు తాను ఒక అవకాశం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రమే గుర్తుకొస్తోందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోకల్ మీడియా అయితే ఇలాంటి అవగాహనతో ప్రశ్నలు అడుగుతుంది. జాతీయ మీడియాకు ఇక్కడి పరిస్థితులు పూర్తిగా తెలియవు గనుక.. వారి ముందు మాటల గారడీతో నీతులు ప్రవచించి తప్పించుకోవచ్చునని.. జగన్ వారికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టుగా ఉంది.