తెదేపా గోడు అదే: వారిద్దరూ ఉండగా న్యాయమెలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎన్నికల వ్యవహారం ఎన్నికల సంఘం కంట్రోల్ లోనే నడుస్తున్నదా? లేదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ లో నడుస్తున్నదా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ అధికార పార్టీ వారి అరాచకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట వారి దందాలు బయటపడుతున్నాయి. ఎన్డీయే కూటమి పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి, స్థానికంగా ఆర్వోలకు పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా సరే.. అరాచకాలు ఆగడం లేదు, తెలుగుదేశం కూటమి కార్యకర్తలు మాత్రమే కాదు, అభ్యర్థుల మీద కూడా దాడులు ఆగడం లేదు. తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ మీద కూడా పోలీసుల ఎదుటే దాడి జరిగింది. ఇన్నేసి అరాచకాలకు ప్రధాన కారణం.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి లను మార్చకపోవడం మాత్రమే అని తెలుగుదేశం భావిస్తోంది. అనేక వారాల కిందట ఎన్నికల పర్వం మొదలైన తొలిరోజుల్లో తెదేపా వారిపై దాడులు, శాంతి భద్రతల వ్యవహారం అదుపులో లేకపోవడం వంటి ఫిర్యాదుల మీద అయిదుగురు ఐపీఎస్ అధికారులను విధులనుంచి ఎన్నికల సంఘం తప్పించింది. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ ను, విజయవాడ కమిషనర్ ను కూడా తప్పించారు. కొందరు ఐఏఎస్ లను కూడా తప్పించారు. అయితే ఈ వ్యవహారాలేవీ అధికారుల తీరులో గానీ, పోలీసుల తీరులోగానీ కించిత్తు మార్పు కూడా తీసుకురాలేకపోయాయనే విమర్శ వినిపిస్తోంది.

కొత్తగా నియామకాలకు పంపే అన్ని పేర్లను కూడా వైసీపీ అనుకూల పేర్లనే పంపుతూ సీఎస్ జవహర్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారని, అదే సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ కిందిస్థాయి వరకు కూడా వైసీపీ నేతలకు సహకరిస్తూ ఉండేలాగా.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనధికారి ఉత్తర్వులతో జగన్ కు సహకరిస్తున్నారని తెదేపా ఆరోపణలు చేస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిజాయితీగా సాగాలంటే ముందు ఈ ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఉన్నదంటూ తెలుగుదేశం కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. తాగాజా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా.. తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రాలనుంచి ఉన్నతాధికారులను డిప్యూట్ చేయించాలని కూడా ఆయన కోరుతున్నారు. జగన్ మాటను అధికారులు వేదంలా పాటిస్తున్నారని ఆ పరిస్థితిలో మార్పు రావాలని కోరుతున్నారు. మరి ఈ విజ్ఞప్తులను అయినా ఈసీ పట్టించుకుంటుందో లేదో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories