చెప్పుదెబ్బలా? : ఏ కాలంలో బతుకుతున్నాం?

ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. మాయోపాయాలు పన్నుతున్నప్పటికీ.. ఓటమి తప్పదనే భయం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను వెన్నాడుతున్నట్టుగా ఉంది. విపరీతమైన అసహనానికి గురవుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో వైసీపీ అభ్యర్థుల విచ్చలవిడితనం కూడా పెరుగుతోంది. వారి అహంకారం కూడా శృతిమించుతోంది. తాజాగా అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కూటమికి మద్దతిస్తున్న ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడి చెప్పుతో కొట్టిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇంత జరిగినా పోలీసులు పద్ధతిగా కేసు నమోదు చేయకుండా చెప్పుదెబ్బ తిన్నవారినే వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఏ కాలంలో ఉన్నాం మనం.. చెప్పుదెబ్బ కొట్టడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య అది. అలాంటి వాళ్లను అసలు మనుషులుగా ఊహించగలమా? ఎంతటి అహంకారం వెల్లువ కాకపోతే.. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చెప్పుతో కొట్టడం జరుగుతుంది.. అనేది ఆలోచించాల్సి ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అహంకారానికి ప్రతీకలుగా నిగ్గుతేలడం ఇది తొలిసారి కాదు. ఈ ఎన్నికల పర్వంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి తన అనుచరుడితో చెప్పులు మోయించుకుంటూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనేమీ అలాంటి అహంకారానికి తొలి వ్యక్తి కాదు. సినీనటి రోజా మంత్రిగా ఉండగా ప్రభుత్వ అధికారితో తన చెప్పులు మోయిస్తూ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఇప్పుడు బూడి ముత్యాల నాయుడు ఏకంగా కూటమికి మద్దతిస్తున్న వ్యక్తిని చెప్పుతో కొట్టి వివాదాస్పదం అయ్యారు.

అనకాపల్లి బూడి చేసిన చెప్పుదాడి రచ్చరచ్చ అవుతోంది. పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడంతో.. భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. దాడికి గురైన వ్యక్తిని పరామర్శించడానికి కూడా సీఎం రమేశ్ ను పోలీసులు అనుమతించకపోవడంతో వివాదం మరింత ముదిరింది.

ఆ సంగతి పక్కన పెడితే.. ఈ స్థాయిలో అసహనానికి గురికావడం అనేది వైసీపీ నాయకుల ఓటమి భయం కారణంగానే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories