కేసీఆర్ తరహాలోనే జగన్ పతనం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు దత్త తండ్రి లాగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రేమాప్యయతలను కురిపిస్తూ ఉంటారు. చాలా రాజకీయ వ్యూహాల విషయంలో ఆయన బాటను అనుసరించి నడుస్తూ ఉంటారు. కేసీఆర్ కు కూడా జగన్ అంటే వల్లమాలిన అభిమానం. 2014లో ఎన్నికలకు ముందు కూడా ఏపీలో జగన్ గెలుస్తారనే  తమ సర్వే నివేదికలు చెబుతున్నాయంటూ కేసీఆర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇటీవల కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుస్తారనే అంచనాలు తమకు ఉన్నాయని కేసీఆర్ సెలవిచ్చారు. ఈ ఇద్దరు నాయకులూ ఒకే జట్టు కావొచ్చు గానీ.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా జగన్ పతనం కూడా కేసీఆర్ బాటలోనే జరుగుతున్నదా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

ప్రజల భూమి హక్కులకు సంబంధించిన ధరణి పోర్టల్ అనేది.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పతనాన్ని శాసించింది. ధరణికి అనుకూలం – ప్రతికూలం అనే రెండు రకాల ఎజెండా పాయింట్లతోనే తెలంగాణ ఎన్నికల్లో భారాస. కాంగ్రెస్ పార్టీలు తలపడ్డాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని తొలగిస్తాం అని రేవంత్ రెడ్డి భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారని విస్తృతంగా ప్రచారం చేశారు. అదే సమయంలో కేసీఆర్ తన ప్రతి ఎన్నికల సభలోనూ ధరణి పోర్టల్ ను బీభత్సంగా వెనకేసుకుంటూ వచ్చారు. ధరణి లేకపోతే మీకు అసలు రైతు బంధువచ్చేదా? ధరణిని మించిన వ్యవస్థ లేనే లేదు.. అని పలురకాలుగా దానిని సమర్థించుకుంటూ వచ్చారు.

ఏది ఏకమైనప్పటికీ ధరణి- భారాస సర్కారును ఓడించింది. అందుకు సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి. అప్పటికే ధరణి పోర్టల్ కారణంగా రేకెత్తిన భూవివాదాలు చాలానే ఉన్నాయి. తమ తమ భూములపై తమ హక్కులు ధరణిలో కనిపించటంలేదంటూ వేల సంఖ్యలో రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. భూమి హక్కుదారుల పేర్లు మారిపోయిన దృష్టాంతాలు కబ్జాలుగా అనేకం వెలుగు చూశాయి. నాయకులు ఎవ్వరేం మాట్లాడినా, కేసీఆర్ ఎన్ని రకాలుగా సమర్థించుకున్నా ధరణి గురించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు రైతులకు తెలుసు గనుక.. దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కేసీఆర్ సర్కారు పతనం అయింది.

ఇప్పుడు అచ్చంగా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదే పనిచేస్తోంది. పేదల భూములను కబ్జా చేయడానికే వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని అటు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఈ అంశానికి ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారంటే.. తను అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ చట్టం రద్దుకు సంబంధించిన ఫైలు మీదనే పెడతానని కూడా వాగ్దానం చేశారు. ఆ మాట రైతుల్లోకి బాగా వెళ్లింది. రైతురుణాలు, రైతు బంధు వాగ్దానాలు వంటి వాటికంటె తమ పొలం కబ్జా కాకుండా చంద్రబాబు కాపాడుతారనే నమ్మకం వారికి కలిగింది. అదే సమయంలో అటు జగన్ గానీ, ఆయన అనుచరులు గానీ.. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమర్థించుకోవడానికే తమ సమయం వెచ్చిస్తున్నారు. ఇది తాము తెచ్చిన చట్టం కాదని, కేంద్రంలోని బిజెపి మీద నెట్టేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదు.

తెలంగాణ ధరణిపోర్టల్ కేసీఆర్ పతనాన్ని నిర్దేశించినట్టుగా, ఏపీలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వ పతనాన్ని శాసించనున్నదాని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories