కేసీఆర్, జగన్ ఇద్దరి కోరిక ఒక్కటే!

2014లో ఒక గట్టి నమ్మకంతో, బంగారు తెలంగాణను సాధిస్తారనే విశ్వాసంతో తన చేతిలో అధికారం పెట్టిన రాష్ట్ర ప్రజలలోని అమాయకత్వం ఇంకా అలాగే పదిలంగా ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపోస్తున్నారేమో తెలియదు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజలలో ఏ కొంచమైనా రాజకీయ చైతన్యం వచ్చిందనే నమ్మకం ఆయనకు ఉన్నదో లేదో కూడా తెలియదు. కానీ తలా తోకాలేని వాదనలు, విశ్లేషణలు, మాటల గారడీలతో పార్లమెంటు ఎన్నికలలో గులాబీ పార్టీ పరువు నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఒకవైపు భారతీయ జనతా పార్టీ సారథి నరేంద్ర మోడీ దేశంలో ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు కట్టబెట్టాలని చాలా ఆశావహ దృక్పథంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ ఊర్లో సభ పెట్టినా తమ కూటమికి 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రజలను అడుగుతున్నారు. అదలాఉండగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ‘కేంద్రంలో ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్షంగా ఏర్పడడం జరగదు’ అని హెచ్చరిస్తున్నారు. ఆయన చెబుతున్న జోస్యం ప్రకారం ఎన్డీఏ కూటమికి కేవలం 200 ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయట. కేంద్రంలో ఈ దఫా కచ్చితంగా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని, భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే గనుక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకొస్తుందని కేసీఆర్ చాలా గంభీరంగా ప్రకటిస్తున్నారు.

తమాషా ఏమిటంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కూడా అచ్చంగా ఇదే కోరిక వ్యక్తమవుతున్నది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికలలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిపించినప్పటికీ కూడా కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాబట్ట లేకపోయిన చేతగానితనాన్ని అందంగా సమర్ధించుకున్నారు.

మనం అనుకున్నది జరగాలంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలలో ఓడిపోవాలని కోరుకోండి. కేంద్రంలో మన మీద ఆధారపడే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకోండి.. అంటూ జగన్మోహన్ రెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేసిన వీడియోలు ఇటీవల కాలంలో సంచలనం అయ్యాయి.

యాదృచ్ఛికం ఏంటంటే తమ మధ్య ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న కేసీఆర్- జగన్ ఇద్దరు కూడా కేంద్రంలో బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. తమ మీద ఆధారపడే ప్రభుత్వమే కేంద్రంలో రావాలంటున్నారు. ఒకవేళ అదే జరిగితే వారు రాష్ట్రప్రయోజనాలకోసం ఆ పరిస్థితిని వాడుతారో, తమ సొంత ప్రయోజనాల కోసం వాడుతారో దేవుడికెరుక! వారి కలలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories