చంద్రబాబునాయుడు పదేపదే అటు ఎన్నికల సంఘానికి, ఇటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మళ్లీ మళ్లీ హెచ్చరించడం అనేది సత్ఫలితాలనే ఇచ్చింది. ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ పేరుతో 32 మంది నిరుపేదల ప్రాణాలను ప్రభుత్వనిర్లక్ష్యం బలి తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయం చేసింది. చంద్రబాబు కారకుడు అంటూ ప్రచారం చేయడానికి.. పండుముదుసులలను ఎండల్లో మంచాల మీద ఊరేగిస్తున్నట్టుగా తీసుకువచ్చి వాళ్ల చావులకు కారణమైంది. అయితే అలాంటి డ్రామాలు మే, జూన్ నెలల పింఛన్ల పంపిణీ వ్యవహరంలో జరిగే అవకాశమే లేదు. చంద్రబాబు రిపీటెడ్ విజ్ఞప్తుల ఫలితంగా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
మే, జూన్ నెలల్లో ఒకటో తేదీనాటికి నేరుగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకే పింఛను మొత్తాలు జమచేసేలాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి మాత్రం ఇళ్ల వద్దకే ప్రభుత్వం సిబ్బంది వెళ్లి 1నుంచి 5వ తేదీలోగా పింఛను అందజేస్తారు. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచాన పడిన వారు, వీల్ చెయిర్ కు పరిమితం అయిన వారు, వితంతువులు, బ్యాంకు ఖాతాలు లేనివారందరికీ ఇళ్లకే అందుతుంది.
చంద్రబాబునాయుడు మాత్రం.. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని యాతన పెట్టకుండా అందరికీ ఇళ్ల వద్దనే పించన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలంటూ ఈసీకి, సీఎస్ కు లేఖలు రాశారు. ఈసీ కూడా సీఎస్ ను హెచ్చరించింది. తాజాగా పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ ఏర్పాట్ల గురించి తెలియజెప్పారు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ ఒకటో తేదీనాటికే నగదు బదిలీ జరుగుతుంది.
రాష్ట్రంలో మొత్తం 65 లక్షలకుపైగా పింఛను లబ్ధిదారులు ఉండగా వారిలో 74 శాతం మందికి ఆధార్ తో ముడిపడిన పేమెంట్ వ్యవస్థ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 48 లక్షలకు పైగా జనానికి అందుతుంది. మిగిలిన వారికి మాత్రం ఇళ్లకే అందుతుంది. మే, జూన్ నెలల్లో ఇదే ఏర్పాటు జరుగుతుంది.
జులైనెలలో తమ ప్రభుత్వం ఏర్పడితే.. ఏప్రిల్ నెల నుంచి రూ.4 వేలకు పింఛను పెంచడంతో పాటు, అరియర్స్ సహా మొత్తం సొమ్మును జులై ఒకటోతేదీన ఇళ్లవద్దకే అందజేస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.