యనమల రామకృష్ణుడు సోదరుడిగా కంటే తుని నియోజకవర్గానికి చెందిన కీలక తెలుగుదేశం నాయకుడిగా యనమల కృష్ణుడికి పేరు ఉంది. అలాంటి నాయకుడు ఇవాళ అసంతృప్తితో తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నాడు అంటే ఆ నియోజకవర్గ రాజకీయాలలో కీలక పరిణామమే! యనమల రామకృష్ణుడు పరోక్షంలో అక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుతూ వచ్చిన వ్యక్తి కృష్ణుడే అనడంలో సందేహం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదని అసంతృప్తి ఆయనను వైయస్సార్ పార్టీలో చేరేలా ప్రోత్సహిస్తోంది. అయితే కృష్ణుడు చేరిక ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా కనిపించవచ్చు గానీ, అందువలన వారు అతిగా మురిసిపోవడం కరెక్టేనా అనే సందేహం స్థానిక ప్రజలలో వ్యక్తం అవుతుంది.
ఇవాళ అసంతృప్తి ఆయనతో ఎలాంటి నిర్ణయం తీసుకునే లాగా అయినా చేసి ఉండొచ్చు గాని, వాస్తవానికి తుని నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ- యనమల కృష్ణుడు అనేవి వేరువేరుగా స్థానికులు చూడలేరు. ఆయన అంతగా కష్టపడి పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు అనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన విలువను ప్రాధాన్యాన్ని తగ్గించలేదు. కాకపోతే పలు దఫాలుగా నిర్వహించిన పార్టీ సర్వేలలో అనుకూల ఫలితాలు రాకపోవడం వల్ల మాత్రమే కృష్ణుడును పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యకు టికెట్ కేటాయించారు. యనమల కృష్ణుడుకు ఎమ్మెల్యే పదవికి ప్రత్యామ్నాయంగా మంచి అవకాశమే ఇస్తామని ఆయన భవిష్యత్తుకు తాము పూచి ఉంటాం అని తెలుగుదేశం పెద్దలు హామీ ఇచ్చారు కూడా. అయినా సరే ఎమ్మెల్యే టికెట్ దక్కలేదనే బాధ ఆయనను వైసీపీ వైపు పంపింది.
కానీ ప్రజలకు కలుగుతున్న సందేహం ఏమిటంటే రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏ కారణం చేతనైనా గాని తునిలో తెలుగుదేశం పార్టీ నే గెలిస్తే యనమల కృష్ణుడు వైసిపి లోనే కంటిన్యూ అవుతారా అనేది సందేహం. ఎందుకంటే ఆయన మూలాలు ఆత్మ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. తునితో పాటు రాష్ట్రంలోర ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఖచ్చితంగా మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చేస్తారని అంతా అనుకుంటున్నారు. అందువల్లనే, యనమల కృష్ణుడు చేరిక గురించి వైఎస్సార్ కాంగ్రెస్ అతిగా మురిసిపోకుండా ఉంటే మంచిదనే అభిప్రాయం వెల్లడవుతోంది.