అప్పల్రాజూ.. ఏమిటి నాయనా ఈ అతి!

అవును మరి. అయిదేళ్లపాటూ అధికారంలో ఉండగా తమ చిత్తానికి ఎలా తోస్తే అలా విపరీతంగా రెచ్చిపోతూ వచ్చారు. తాము ఆడిన ఆటకు ఎదురుచెప్పేవాళ్లు లేరు. అడ్డు నిలిచే అధికారులు లేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అచ్చంగా అలాంటి దుర్మార్గపు దందానే అలవాటు అయిపోయినట్లుంది. అందుకే ఎన్నికల అధికారి నిబంధనల గురించి మాట్లాడితే.. పలాస నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సీదిరి అప్పలరాజు ఒక రేంజిలో రెచ్చిపోయారు. తన వాహనాన్ని ఆపినందుకు ఆయన ఎన్నికల అధికారి ఆశాలత మీద విరుచుకుపడ్డారు.

‘డోన్ట్ యాక్ట్ టూ స్మార్ట్’, ‘వాటీజ్ హేపెనింగ్ హియర్’, ‘ఏంటీ టార్చర్ మాకు’, ‘ఏంటి తమాషా ఇది’, ‘ఎవరికి కంప్లయింటు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి’, ‘ఇంకోసారి మా ప్రచారరథం ఆపారంటే బాగోదు చెబుతున్నాను.. సీరియస్ గా చెబుతున్నాను నేను’, ‘రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇంకెక్కడా ప్రచార రథాలు లేవా.. మీరొక్కరే విధులు నిర్వర్తిస్తున్నారా’, ‘ప్రచారరథం కీస్ ఆమెకే ఇచ్చేయండయ్యా.. ఇంకో లక్షరూపాయలు కూడా ఇచ్చేయండి.. ఎలా ఉండాలో ఏ రంగులు వేయాలో ఆమే తయారుచేసి ఇస్తారు’.. ఈ మాటలన్నీ గమనిస్తే సీదిరి అప్పలరాజు ఏ స్థాయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థం అవుతుంది. తన ప్రచారరథం వాహనం ఆపి, నిబంధనలు గుర్తుచేసినందుకు ఎన్నికల అధికారి ఆశాలతతో ఆయన వ్యవహరించిన తీరు ఇది.

ఒక వైపు అధికారి ఆశాలత చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ.. ‘నిబంధనలు చెబుతోంటే గొడవ పెట్టుకుంటారేమిటి సార్’ అని అంటూ ఉన్నప్పటికీ మంత్రి సీదిరి అప్పలరాజు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. దాదాపుగా కొట్లాటకు దిగిన రీతిలో సీదిరి అప్పలరాజు అధికారి మీదిమీదికి వెళుతూ బెదిరించేందుకు ప్రయత్నించారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వంలోని మంత్రులు కూడా వారి అధికార వైభోగాన్ని పక్కన పెట్టాల్సిందే. బుగ్గకార్లు వాడడానికి కూడా వీలుండదు. నామ్ కే వాస్తే వారిని మంత్రిగా వ్యవహరించాల్సిందే తప్ప.. సీఎం సహా, మంత్రులు సుషుప్తావస్థలో ఉన్నట్టే లెక్క. ఎన్నికల సమరాంగణంలో ఒక మామూలు ఇండిపెండెంటు అభ్యర్థి ఎంతో, మంత్రి అయినా అభ్యర్థిగా అంతే. ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం మాత్రమే సర్వాధికారాలను కలిగి ఉంటాయి. అయితే ఏకంగా ఎన్నికల అధికారి మీదికే సీదిరి అప్పలరాజు గొడవకు దిగినట్టుగా మీదిమీదికి వెళ్లిపోవడం.. తీవ్రస్థాయిలో బెదిరించడం ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దందాలు, బెదిరింపులను నమ్ముకునే గెలవాలనుకుంటున్నారా? అనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories