జగన్ బ్యాండేజీ : సింపతీకోసం చూస్తే చీము పడుతుందా?

ఎవడో ఆకతాయి రాసి విసిరినందుకు జగన్మోహన్ రెడ్డి నుదుటిమీద చిన్న గాయమైంది. నిజం చెప్పాలంటే చాలా చిన్నగాయం అది. ముఖ్యమంత్రికి తగిలిన గాయం గనుక.. దాని గురించి హడావుడి ఎక్కువగా జరిగింది. గాయం తగిలిన నాటినుంచి రెండు వారాలకు పైగా జగన్మోహన్ రెడ్డి ఆ చిన్నగాయానికి వేసుకున్న పెద్ద బ్యాండేజీతోనే తిరుగుతున్నారు. సభల్లో ప్రజలకు ఆ గాయాన్ని చూపించి నన్ను చంపేయాలనుకున్నారు.. అయినా సరే భయపడకుండా పోరాడుతాను.. అని సింపతీ ఆశించే డైలాగులు చెప్పాలని ఆయన తపన పడ్డారేమో గానీ.. నిజానికి బ్యాండేజీని ఇన్నాళ్లుగా తొలగించకపోవడం వల్ల ఆయనకు సెప్టిక్ అయి చీము పట్టే ప్రమాదం కూడా ఉంది. కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్న సామెత చందంగా.. జగన్మోహన్ రెడ్డి సింపతీ కోసం ప్రయత్నించి తన గాయాన్ని పెద్దది చేసుకుంటారేమో అనికూడా ప్రజలు అనుకుంటున్నారు.

నిజానికి జగన్ కు తగిలిన గాయం చాలా చిన్నది. ఇళ్లలో పిల్లలకు ఆడుకుంటూ ఉండగా కూడా అలాంటి దెబ్బలు అనేకం తగులుతూనే ఉంటాయి. వంటింట్లో ఉండే పసుపు చిటికెడు పెడితే ఆమాత్రం గాయం రెండురోజుల్లో ఎండి పొక్కు కట్టేస్తుంది. నాలుగురోజులకు మచ్చ కూడా కనిపించదు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఈ చిన్న గాయం ద్వారా చాలా పెద్ద మైలేజీని సానుభూతి రూపంలో ఆశించారు. అందుకే గాయానికి సరిపడినంత చికిత్సను బస్సులోనే చేయించుకున్నప్పటికీ.. ఆయన జీజీహెచ్‌కు వెళ్లి రెండు కుట్లు కూడా వేయించుకున్నారు. కుట్ల పడ్డ రోజు చాలా చిన్న బ్యాండేజీ వేశారు డాక్టర్లు. మరురోజు విశ్రాంతి తీసుకున్నారు. మూడోనాడు తిరిగి ప్రజల్లోకి వెళ్లే సమయానికి ఆ బ్యాండేజీ కూడా తీసేసి ఉండొచ్చు. కానీ.. జగన్ లక్ష్యం ‘గాయం ద్వారా ప్రజల సానుభూతి’! అందుచేత ఆయన మరింత పెద్ద బ్యాండేజీ తగిలించుకున్నారు. అప్పటినుంచి నుదుటిమీద గాయానికంటె చాలా పెద్దదైన బ్యాండేజీతోనే ఇప్పటిదాకా ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు.

అయితే ఆయన చెల్లెలు, స్వయంగా డాక్టరు కూడా అయిన నర్రెడ్డి సునీత, అన్నయ్యకు ఒక సలహా ఇస్తున్నారు. గాయానికి బ్యాండేజీ తీయకుండా అలాగే పెట్టుకోవడం వలన, గాయం సెప్టిక్ అయి చీముపడుతుందని ఆమె సూచిస్తున్నారు. బ్యాండేజీ తీసేస్తే గాయం త్వరగా ఆరిపోతుందని అంటున్నారు. ఆమాత్రం సింపుల్ సంగతి స్వయంగా డాక్టరు కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? కానీ, ఆయన ఆశిస్తున్నది అనుచితమైన సానుభూతి మైలేజీ కదా.. బ్యాండేజీ తీసేస్తే ఎలా అనేది కొందరి సందేహం.

అయినా.. జగన్ షాట్ లో కెమెరా ముందుకు వెళ్లే నటులు.. కంటిన్యుటీ మేకప్ చెక్ చేసుకున్నట్టుగా ప్రజల్లోకి వచ్చేప్పుడు మాత్రమే బ్యాండేజీ తగిలించుకుంటున్నారని, తిరిగి ఇంటికి వెళ్లగానే దాన్ని తీసేస్తున్నారని… గాయం ఎప్పుడో పూర్తిగా ఆరిపోయిందని కూడా కొందరు అంటున్నారు. పాపం ఓట్లకోసం ఎవరి తిప్పలు వారివి.!!

Related Posts

Comments

spot_img

Recent Stories