వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరువాత.. ఆస్థాయిలో పెత్తనం చెలాయిస్తూ ఉండే ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తమ చిత్తూరు జిల్లాలో మాత్రమే కాదు.. అటు గోదావరి జిల్లాల వరకు కూడా.. అన్ని పార్టీ వ్యవహారాల్లోనూ ఈ పెద్దిరెడ్డి తండ్రీ కొడుకుల ముద్ర ఉండాల్సిందే. జగన్ కూడా అంతగా పెద్దిరెడ్డి మీద ఆధారపడి ఉన్నారనేది అందరికీ తెలిసిన సంగతే. అలాంటి పెద్దిరెడ్డి ఇలాఖాలో ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రెండురోజులు కేటాయించారు. మేనెల 3,4 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన ఉంటుంది. నిజానికి 3,4 తేదీలు తెలంగాణలో ఎన్నికల సభలు నిర్వహించాలని తొలుత ప్లాన్ చేసినప్పటికీ.. తర్వాత పరిణామాల్లో ఏపీలో సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ఆయన షెడ్యూలు రూపొందించారు. మే 3వ తేదీన మధ్యాహ్నం పీలేరులో బహిరంగసభలో ప్రసంగించే ప్రధాని మోడీ, సాయంత్రం విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. నాలుగోతేదీ మధ్యాహ్నం రాజమండ్రి, సాయంత్రం అనకాపల్లిల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. అయితే పెద్దిరెడ్డి ఇలాఖాలోనే మోడీ తొలిసభ జరుగుతుండడం విశేషం.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతానికి పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నప్పటికీ.. ఆయన పీలేరు రామచంద్రారెడ్డిగానే చిరపరిచితులు. ఆ నియోజకవర్గంపై ఆయన ప్రభావం చాలా ఉంటుంది. పైగా అక్కడ పెద్దిరెడ్దికి ఆజన్మ శత్రువులైన నల్లారి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ బరిలో ఉంది. ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం తరఫున పోటీచేస్తుండగా. ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డితోనే తలపడుతున్నారు. ఈనేపథ్యంలో పీలేరు బహిరంగసభలో మోడీ పెద్దిరెడ్డి కుటుంబం అక్రమాలపై ఏ స్థాయిలో నిప్పులు చెరగుతారు? అనేది ఇప్పుడు ప్రజల్లో ప్రశ్నార్థకంగా ఉంది.
జగన్ ప్రభుత్వపు అవినీతిలో సింహభాగం పెద్దిరెడ్డి ద్వారానే జరుగుతూ ఉన్నదనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. ఇైసుక దందాలు గానీ, చవకబారు లిక్కర్ తయారీతో రాష్ట్రాన్ని ముంచెత్తుతూ వేలకోట్ల అక్రమార్జనలకు పాల్పడుతుండడంగానీ.. సమస్తం పెద్దిరెడ్డి ద్వారానే జరుగుతున్నాయనేది ప్రత్యర్థులు అంటూ ఉంటారు. అలాంటిపెద్దిరెడ్డి ఇలాఖాలో సభ పెట్టిన నరేంద్రమోడీ.. వారి అరాచకాలపై తన విమర్శనాస్త్రాలను సంధిస్తారా? లేదా, కర్ర విరగకుండా పాము చావకుండా.. ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వండి అనే మాటను వందసార్లు జపించి.. వెళ్లిపోతారా? అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు.