చిన్నమ్మ డిమాండ్ ఓకే అయితే.. జగన్‌కు దబిడిదిబిడే!

ఏ చిన్న ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల సంఘం ఉపేక్షించడం లేదు. ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని సమాచారం అందితే చాలు.. ఎన్నికల సంఘం కత్తి దూస్తోంది. వారిపై వేటు వేసి ఎన్నికల విధుల నుంచి పూర్తిగా దూరం ఉంచడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా కొత్త పేర్లు తెప్పించుకుని వారిలో ఒకరిని ఆయా స్థానాలకు నియమిస్తోంది. తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ నగర కమిషనర్ల నియామకం ఒక హాట్ టాపిక్. కాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి, రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎంపీగా తలపడుతున్న దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి చేసిన తాజా విజ్ఞప్తిని గమనిస్తే మరిన్ని సంచలనాలు రాష్ట్రంలో నమోదవుతాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే చిన్నమ్మ ఏకంగా 26 మంది ఐపీఎస్ అధికారులను తక్షణం విధుల నుంచి తప్పిస్తే తప్ప ఎన్నికలు పారదర్శకంగా జరగవు అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. దాదాపుగా అన్ని కీలకపోస్టుల్లోనూ తనకు పూర్తిగా అనుకూలంగా ఉండే వారిని మాత్రమే నియమించారనే కంప్లయింటు చాలా కాలంనుంచి ఉండనే ఉంది. ప్రత్యేకించి ఐపీఎస్ అధికారుల విషయంలో స్థానిక వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తే వారిని మాత్రమే నియమిస్తూ వచ్చారనే మాట ఉంది. ఇటీవల తిరుపతి జిల్లాకు కొత్త ఎస్పీని నియమిస్తే.. దొంగఓట్ల కేసుల గురించి ఆరా తీసినందుకు కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే, స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆమెను అక్కడినుంచి బదిలిచేసేశారు. జగన్ పరిపాలనలో ఆయన మాటకు డూడూ బసవన్నలాగా తల ఊపే అలవాటు లేని ఐపీఎస్ అధికారులంతా కూడా అప్రాధాన్య, లూప్ లైన్ల పోస్టుల్లో ఉన్నారనే వాదన చాలా కాలంగా ఉంది. అందుకే ఇప్పుడు పురందేశ్వరి ఏకంగా 26 మంది ఐపీఎస్ లను విధులనుంచి తప్పిస్తే తప్ప ఎన్నికలు పారదర్శకంగా జరగబోవని అంటోంటే.. ఆమె వాదనకు బలం పెరుగుతోంది.

పైగా ఏ ఐపీఎస్ మీద ఎన్నికల సంఘం వేటువేసినా కూడా.. కొత్త ప్యానెల్ గా సీఎస్ సూచించే పేర్లలో ఖచ్చితంగా మళ్లీ వైసీపీ అనుకూల వ్యక్తుల పేర్లు ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పురందేశ్వరి అడుగుతున్నట్టుగా.. 26 మందిని ఈసీ మారుస్తుందా? నిష్పాక్షిక అధికారులు వస్తారా? అనేది ఒక చర్చ. అదే జరిగితే గనుక.. ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడడం ద్వారా నెగ్గవచ్చుననే ధీమాతో ఉన్న జగన్ అండ్ కో దళాలకు దబిడిదిబిడే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories