వైసీపీ ఆనందం ఆవిరి : ఎడ్వాంటేజీ పవన్ కే!

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు అనేది తాత్కాలికంగా కేటాయించిన గుర్తు గనుక ఇటీవల దానిని రద్దు చేస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అలాంటి ఉత్తర్వులు వెలువడ్డాయో లేదో.. వైఎస్సార్ సీపీ శ్రేణులు మొత్తం పండగ చేసేసుకున్నాయి. గ్లాసు గుర్తు కు జనసేనకు ఇక లేదంటూ వైసీపీ అనుకూల మీడియా కథనాలను వండి వార్చింది. ఈసీ తీసుకున్న నిర్ణయం కేవలం లాంఛనం మాత్రమేనని, పార్టీ అడిగితే మళ్లీ అదే గుర్తు ఆ పార్టీకి కేటాయించడం సర్వసాధారణం అని ప్రజలందరికీ తెలుసు. వారందరికీ కూడా తెలుసు. కానీ.. తాము అలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తే జనసేన శ్రేణులన్నీ డీలా పడిపోతాయని , వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చునని వైసీపీ వారు భ్రమించినట్టుగా ప్రచారంచేశారు. ఇంకొన్ని కుట్రలు కూడా నడిపారు. ఆనందించారు. అయితే ఇప్పుడు వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది.

ఒకసారి రద్దయిన తర్వాత.. జనసేన మళ్లీ దరఖాస్తు చేసుకోగా.. గాజు గ్లాసు గుర్తు ను తిరిగి జనసేనకే కేటాయించింది. అయితే జనసేన పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) అనే పార్టీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మొత్తానికి ఆ పిటిషన్ ద్వారా గాజు గ్లాసు గుర్తు జనసేనకు కాకుండా చేయాలని ఆశించారు. అలాంటి పిటిషన్ వెనుక ఎవరు ఉండి వ్యవహారం నడిపిస్తుంటారో ప్రజలందరూ కూడా ఊహించుకోదగినదే.

అయితే హైకోర్టులో ఆ పిటిషన్ వీగిపోయింది. ఆ గుర్తుకోసం జనసేన పార్టీ ముందుగానే దరఖాస్తు చేసుకున్నదని, నిబంధనలకు అనుగునంగా.. మొదట వచ్చిన వారికి మొదట విధానంలోనే జనసేనకు గుర్తు ఇవ్వడం జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం తమ వాదనల్లో కోర్టుకు నివేదించింది. దీంతో ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
నిజానికి ఇది చాలా చిన్న సాంకేతికమైన వ్యవహారం. దీనితోనే జనసేన పార్టీని దెబ్బకొట్టేసినట్టుగా వైసీపీ పండగ చేసుకోవడం చిల్లర వ్యవహారం అని.. ఇప్పుడు అంతిమంగా పవన్ కే ఎడ్వాంటేజీ దక్కిందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories