తీగలాగితే డొంక కదలడం గురించి మనకు తెలుసు. కానీ, తీగలాగితే ఏకంగా భవంతులు, హర్మ్యాలు, వాటికోసం నిర్మించిన పునాదులు కూడా కదులుతున్నాయి యిక్కడ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు విపరీతంగా జనాదరణ వెల్లువెత్తుతున్నదంటూ ఆయన అనుకూల మీడియాలో నిత్యం ఊదరగొడుతూ ఉంటారు. జగనన్నను చూడడానికి రోడ్డుమీదికి జనం ఎగబడి వస్తున్నారంటూ పదేపదే చెబుతూ ఉంటారు. వారినందరినీ జగనన్న పలకరించి నెత్తి నిమిరి ఆశీర్వదిస్తూ ఉంటారు కూడా. అయితే, ఇదంతా నిజమైన ప్రజాదరణేనా? అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. ఇందులో చాలా బూటకం ఉన్నదని, వారందరూ పెయిడ్ కూలీలుగా పార్టీ నేతలు తీసుకువస్తున్న నిరుపేదలని బయటపడుతోంది. ఎలా బయటపడుతోంది అనుకున్నారు? జగనన్న మీద ఎవడో ఆకతాయి రాసి విసిరిన కేసు వలన!
ఆకతాయి రాయి విసరడాన్ని చాలా సీరియస్ గా తీసుకుని 8 బృందాలుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. విజయవాడలోని వడ్డెర కాలనీకి చెందిన అయిదుగురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో సతీష్ అనే కుర్రాడు జగన్ మీద రాయి విసిరాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో స్థానికులు తీస్తూ ఉండిన కొన్ని వీడియోలను పరిశీలించి ఇలాంటి నిర్ధరణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న అయిదుగురు కుర్రాళ్లలో సతీష్ అనే కుర్రాడు మాత్రమే మేజర్. మిగిలిన వారు బాలలు. వారంతా ప్రస్తుతం పోలీసు నిర్బంధంలో ఉన్నారు.
మరోవైపు తమ పిల్లలను పోలీసులు అన్యాయంగా తీసుకువెళ్లారని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వారిని విడిచిపెట్టాలని వడ్డెరకాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో భాగంగా.. జగన్ సభలకు జనాన్ని తరలించడానికి వైసీపీ చేస్తున్న అడ్డదారులు కూడా బయటకు వస్తున్నాయి. పార్టీ జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిలబడితే 300 ఇస్తామని చెప్పారని, ఆ డబ్బుకు ఆశపడి వెళ్లినందుకు ఇప్పుడు తమను పోలీసులు వేధిస్తున్నారని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. జగన్ సభలకు జనాన్ని ఎలా తరలిస్తున్నారో ఈ మాటలను బట్టి అర్థమవుతోంది.
సభలకు తరలించిన జనం.. పేమెంట్ అయిన వెంటనే క్షణం కూడా అక్కడ ఉండడం లేదు. తిరిగి వెళ్లిపోతున్నారు. విజయవాడ రోడ్డుషో హోరెత్తిపోయింది అనుకుంటే.. అక్కడి జనం అంతా ఇలా తరలించిన వారే అని తెలిసిపోతోంది.
ఇక్కడే ఇంకో ట్విస్టు కూడా ఉంది. జగన్ సభకు వస్తే క్వార్టర్ బాటిల్ తో పాటు 350 రూపాయలు ఇస్తామని అన్నారని, క్వార్టర్ ఇచ్చారే తప్ప 350 ఇవ్వలేదని అందుకే జగన్ మీద రాయి విసిరానని పోలీసుల అదుపులో ఉన్న యువకుడు చెప్పినట్టుగా ఒక పుకారు వినిపించింది. అయితే ధ్రువపడలేదు.