జగన్‌కు దళితప్రేమ ఉంటే త్రిమూర్తులను తప్పించాలి!

ఎస్సీ ఎస్టీల కోసం ఎంతో పాటుపడుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయా నిమ్న వర్గాలపై తనలో ప్రేమ పొంగిపొర్లుతూ ఉంటుందని కూడా చాటుకుంటూ ఉంటారు. వారి అభ్యున్నతికి అనేకానేక పథకాలు తీసుకువచ్చినట్లుగా కూడా మాటలు వల్లెవేస్తుంటారు. అయితే ఆయన తనలోని దళిత ప్రేమను ఇప్పుడు ఆచరణలో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. దళితులకు శిరోమండనం చేయించిన కేసులో జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులును మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నుంచి పక్కకు తప్పిస్తే గాని  జగన్ మోహన్ రెడ్డి తనలోని దళిత ప్రేమను నిరూపించుకున్నట్లు  తేలదు.

ఎస్సీ ఎస్టీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చులకన భావం ఉన్నదా? వారికి పథకాలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటే చాలు వారు ఎప్పటికీ తమకు బానిసలుగా పడి ఉంటారనే అభిప్రాయం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఉన్నదా? ప్రభుత్వం నుంచి పథకాల కోసం ఆశపడడం తప్ప- ఎస్సీ ఎస్టీలకు ఆత్మాభిమానంగానీ, ఆత్మగౌరవం గానీ ఉంటాయని జగన్‌కు తెలియదా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో సాగుతోంది. ఎస్సీ ఎస్టీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉండడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

దళిత డ్రైవరును హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాలలో ఒక  స్టార్ క్యాంపెయినర్. అంతా తానై నడిపిస్తున్నారు. అదే మాదిరిగా 28 ఏళ్ల కిందట ఐదుగురు దళితులను నిర్బంధించి.. ఇద్దరికి కనుబొమలు తీయించడంతో సహా శిరోముండనం చేయించిన దుర్మార్గమైన కేసులో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావడానికి తలపడుతున్నారు. తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా!
ఇలా దళితులకు శిరోముండనం చేసిన త్రిమూర్తులు, దళితుడిని హత్య చేసి ఇంటికి చేరవేసే అశోక్ బాబు ఇద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజపూజ్యం కల్పించిన ఎమ్మెల్సీలే కావడం విశేషం! త్రిమూర్తులకు తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం డబుల్ బొనాంజా అనుకోవాలి.

పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులును తక్షణ మండపేట అభ్యర్థిత్వం నుంచి పక్కకు తొలగించి ఆ స్థానం నుంచి మరొకరు పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించకపోయినట్లయితే ఆ పార్టీ పరువు గంగలో కలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories