చంద్రబాబుపై నమ్మకం- వాలంటీర్లలో ధిక్కారం!

వాలంటీర్లను అడ్డగోలుగా ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని, కేవలం ఈ ఎన్నికలలో అనుచితమైన రీతిలో వారి సేవలను వాడుకొని ఓటర్లను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ప్రభావితం చేయాలనే కోరికతోనే గత ఐదు సంవత్సరాలుగా వారిని పోషిస్తూ వచ్చాం అనేది అధికార పార్టీ నాయకులు అభిమతం. అయితే ఇప్పుడు వారి కోరికకు భిన్నంగా వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం వి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ని కూడా ఆపు చేయించింది. అయితే వాలంటీర్లతో రాజీనామాలు చేయించి అయినా సరే ఎన్నికల ప్రచారంలో తమతో పాటు తిప్పుకోవాలని అనుకుంటున్న వైసిపి అభ్యర్థులకు అనేకచోట్ల చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి. ‘మేం రాజీనామా చేసేది లేదు పొమ్మని’ వాలంటీర్లు ధిక్కరిస్తున్నారు! చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీ- పదివేల వేతనం అనేది వారిని రాజీనామా చేయనివ్వవ్వకుండా అడ్డుకుంటోంది. బాబు ప్రభుత్వం ఏర్పడాలని కోరుకునేలా చేస్తోంది.

వాలంటీర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలినుంచి రకరకాలుగా మభ్యపెడుతూ వచ్చారు. వారికి ఎన్నికల సమయంలో భారీ నగదు కానుకలు కూడా ముట్టజెప్పి తమకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నించారు. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మాత్రమే వాలంటీర్లుగా నియమిస్తూ వచ్చినప్పటికీ వారిలో చంద్రబాబు పట్ల ఒక భయాన్ని కలిగిస్తూ వచ్చారు. చంద్రబాబు నెగ్గితే గనుక వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుంది అనే భయాన్ని పుట్టించి తద్వారా తెలుగుదేశం వ్యతిరేక ప్రచారం జరిగేలాగా వ్యూహరచన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి కుయుక్తులను తిప్పికొట్టే విధంగా- తాను గెలిచినప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఎప్పటిలాగా అలాగే ఉంటుందని.. అంతేకాకుండా వారిలో ఉన్నత విద్యావంతులైన వారికి పెద్ద జీతాలతో ఇతర కొలువులు వచ్చేలాగా కూడా తాను ఏర్పాటు చేయగలనని ఆశాజనకమైన హామీని ఇచ్చారు.

అదొక్కటే కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని వాలంటీర్ల వేతనాలను 10,000 రూపాయలకు పెంచుతానని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అయినప్పటికీ కూడా జీతం పెరుగుతుందనే ఆశ వారిని చంద్రబాబు విజయాన్ని కోరుకునే లాగా తయారు చేసింది. అందుచేత వాళ్ళు తమకు అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయడానికి మొండికేస్తారు అనే భయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఏర్పడింది.

ఫలితంగా వారు కొత్త వ్యూహరచనకు సిద్ధపడ్డారు. వాలంటీర్లను ముందుగా రాజీనామా చేయించి నిత్యం తమ వెంట ఉండేలా తమకు అనుకూల ప్రచారంలో పాల్గొనేలా ఎన్నికలలో వాడుకోవాలని అనుకున్నారు. ఈ రెండు నెలల పాటు వారి జీతాలను కూడా తామే చెల్లిస్తాం అని ప్రకటించారు. ఆ మేరకు ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. వారు తెలుగుదేశానికి అనుకూలంగా ఎవరినీ ప్రభావితం చేయకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. ఎన్ని మాయోపాయాలు పన్నుతున్నప్పటికీ కొన్నిచోట్ల వాలంటీర్లు లొంగడం లేదు.
వైసిపి నాయకులు ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ రాజీనామా చేయడానికి వారు తిరస్కరిస్తూ ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. చూడబోతే రాజీనామాలు చేసిన వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని, రాజీనామా చేయడానికి ఇష్టపడని వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబు తమ వేతనాలు పెంచుతాడనే ఆశతో తెలుగుదేశానికి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని అనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories