జగన్మోహన్ రెడ్డికి నుదుటిమీద గాయమైంది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులమీద ఇలాంటి దాడి జరగడం అనేది హేయమైన విషం. దాడి ఎవరి మీద జరిగినా ఖండించి తీరాల్సిందే. సహజంగానే.. దాడిలో గాయపడింది జగన్మోహన్ రెడ్డి గనుక.. నిందలన్నీ చంద్రబాబునాయుడు మీద, తెలుగుదేశం మీద పడుతున్నాయి. ఆదివారం తెల్లవారే సరికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు సీనియర్ నాయకులు అందరూ కూడా యాక్టివేట్ అయ్యారు. ఒక నరహంతకుడిగా చంద్రబాబునాయుడును చిత్రించడానికి ఎన్నెన్ని రకాలుగా తిట్టవచ్చునో వాళ్లు చూపిస్తున్నారు. అందరూ ఒకే పని మీద ఉన్నారు. అయితే చంద్రబాబును దోషిగా ప్రజల ఎదుట నిలబెట్టాలనే రంధిలో పడి.. కీలకంగా పట్టించుకోవాల్సిన అనేక విషయాలను చాలా మంది విస్మరిస్తున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా బస్సుయాత్రలో రోడ్డుమీద వస్తున్న సమయంలో విజయవాడ వంటి అగ్రశ్రేణి నగరంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం ఏమిటి? ఇది చాలా చిత్రంగా కనిపిస్తోంది. జగన్ బస్సు మీదనుంచి అభివాదం చేస్తూ ఉండగా.. పక్కనుంచి రాయి చాలా వేగంగా వచ్చి ఆయన తలకు తగిలింది. ఆ పక్కనే ఒక స్కూలు భవనం ఉంది. అటువైపు నుంచి క్యాట్ బాల్ తో రాయి విసిరి ఉండచ్చునని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కావచ్చు – కాకపోవచ్చు అదంతా వేరే సంగతి. కానీ ఏం జరిగిందో స్పష్టంగా తెలిసే అవకాశమే లేకుండా ఆ సమయంలో ఆ రోడ్డులో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం ఏమిటి? ఆ కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.
సింగనగర్ రోడ్డులో జగన్ మీద దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ ఫుటేజీద్వారా దుండగులను గుర్తించేపనిలో ఉన్నారు.
సాధారణంగా సీఎం బస్సు యాత్ర అంటే.. చాలా పెద్దస్థాయిలో వీడియో కవరేజీ జరుగుతూ ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన, సాక్షి టీవీకి చెందిన వీడియో కెమెరాలు నిరంతరాయంగా ఆయన పర్యటను షూట్ చేస్తూ ఉంటాయి. వారి డ్రోన్ కమెరాలు కూడా ఆయన యాత్ర పొడవునా పనిచేస్తూ ఉంటాయి. అలాగే భద్రత ఏర్పాట్ల నిమిత్తం పోలీసులు వాడే డ్రోన్ కెమెరాల నిఘా కూడా ఉండే అవకాశం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ రాయి వచ్చిన తీరు కొంత కనిపిస్తోందే తప్ప స్పష్టత లేకుండాపోయింది. దీనికి కేవలం ఆ ప్రాంతంలో కరెంటు లేకపోవడం మాత్రమే కారణం. ముందు అటువైపు నుంచి ప్రారంభిస్తే.. అసలు దోషులవైపు లీడ్ దొరుకుతుందని పలువురు భావిస్తున్నారు.