తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు భేటీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారపర్వంలో ముందుకు సాగాల్సిన వ్యూహాలు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రణాళిక, ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసినప్పటికీ.. ఒకటిరెండు మార్పులు చేసుకోవడానికి గల అవకాశాలను గురించిన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలతో పాటు బిజెపి జాతీయ నాయకులు కూడా పాల్గొన్న ఈ భేటీలో ప్రధానంగా అనపర్తి ఎమ్మెల్యే స్థానాన్ని బిజెపి వదులుకోవడం గురించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ మూడు పార్టీల నాయకుల మధ్య ఎలాంటి చర్చ జరిగిందో, ఎలాంటి ఒడంబడిక ఏర్పడిందో తెలియదు గానీ.. అనపర్తి స్థానాన్ని త్యాగం చేయడం కమలదళానికే ఎక్కువ లాభం అనే వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ సీటును బిజెపి గెలుచుకోవడానికి, పురందేశ్వరి ఎంపీగా సభలో అడుగుపెట్టడానికి ఈ త్యాగం ఉపయోగపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
నిజానికి బిజెపి తమకున్న బలానికి మించి ఆరు ఎంపీ స్థానాలను పది ఎమ్మెల్యే స్థానాలను ఒప్పందంలో భాగంగా తమ వాటాగా పుచ్చుకుంది. వారికి ఎంపీసీట్లు ప్రధానంగనుక.. 6 స్థానాల సంగతి పక్కన పెడితే.. తెలుగుదేశం 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇవ్వడానికి మొగ్గు చూపించినప్పటికీ.. బిజెపి చాలా గట్టిగా పట్టుపట్టి 10 స్థానాలు తీసుకుంది. అందులో అనపర్తి కూడా ఉంది. నిజానికి అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సొంత బలం సున్నా అనే చెప్పాలి. కానీ తెలుగుదేశానికి బలమైన అభ్యర్థి ఉన్నారు. ఒప్పందాల్లో ఇలా జరుగుతుందనే అంచనా లేక ఆయన ముమ్మరంగా ప్రజల్లో ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బిజెపికి ఆ సీటు దక్కిన తర్వాత అతి కష్టమ్మీద అక్కడకు అభ్యర్థిని ఎంపిక చేశారు. కానీ.. బలహీనమైన అభ్యర్థి కావడం వలన.. కనీసం గట్టిపోటీ ఇవ్వలేరనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తున్న సంగతి.
అదే సమయంలో.. అనపర్తి స్థానాన్ని తెలుగుదేశానికి కేటాయిస్తే.. అక్కడ ఓట్లు బాగా పడతాయని, ఆ ప్రభావం వల్ల రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తున్న పురందేశ్వరికి కూడా అనపర్తి సెగ్మెంటునుంచి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదనేది స్థానికుల విశ్లేషణ. బిజెపి తమకు బలం లేని సీటు కూడా కావాలంటూ పట్టుదలకు పోకుండా.. అనపర్తి స్థానాన్ని త్యాగం చేస్తే.. అంతిమంగా రాజమండ్రి ఎంపీ రూపంలో వారి పార్టీనే లాభపడుతుందని.. అలా చేయకపోతే ఉభయులూ నష్టపోతారని ప్రజలు అంటున్నారు.