పులివెందులలో గర్జించనున్న షర్మిల!

కడప జిల్లాల్లో ఇప్పటికే వైఎస్ షర్మిల వరుసగా నాలుగు రోజులు నిర్వహించిన బస్సు యాత్రతో జగన్మోహన్ రెడ్డి పార్టీలో జ్వరం తెప్పించారు. ఇప్పుడు శుక్రవారం నాడు ఆమె ఏకంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎన్నికల ప్రచార సభలను నిర్వహించబోతున్నారు. ఏ అన్ననైతే, చిన్నాన్న వివేకా హంతకులను కాపాడుతున్న దుర్మార్గుడి, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న వంచక పాలకుడిగా వైఎస్ షర్మిల అభివర్ణిస్తూ ఉన్నారో.. అదే జగనన్న పోటీచేస్తున్న నియోజకవర్గంలో ఆమె నిర్వహించబోతున్న సభలు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి.

వైఎస్ షర్మిల తన చిన్నాన్న వివేకానందరెడ్డి కూతురు సునీతతో కలిసి పులివెందుల నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నిర్వహించిన బస్సు యాత్రలో వివేకాహత్య వెనుక అవినాష్ రెడ్డి పాత్ర గురించి అనేక విమర్శలు చేశారు. వారి ప్రచారం కారణంగా.. ఆ సంగతి ఎంతగా ప్రజల్లోకి వెళ్లిపోయిందంటే.. ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ ను మార్చి, అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించాలని జగన్ యోచించే వరకు వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలోనే అంటే.. షర్మిల మరింత ఆవేశంగా, మరింత పదునుగా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడతారని అందరూ అంచనా వేస్తున్నారు.
శుక్రవారం వేంపల్లెలో తొలుత ఆమె బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. తర్వాత లింగాల, సింహాద్రిపురంలలో పర్యటించి సాయంత్రం ఆరున్నరకు పులివెందుల చేరుకుని అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు.

అయితే కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తున్న నేపథ్యంలో పులివెందులు నియోజకవర్గం నుంచి కూడా.. కరడుగట్టిన వైఎస్సార్ అభిమానులైన నాయకులు, పెద్దవాళ్లను షర్మిలకు అనుకూలంగా తిప్పుకునేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వివేకా కూతురు సునీత, భర్తతో కలిసి నియోజకవర్గంలోని పలువురి ఇళ్లకు వెళుతూ.. తన తండ్రిని చంపిన వారికి మద్దతు ఇవ్వవద్దని, షర్మిలకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. వీరిలో ఇప్పటికే కొందరు షర్మిలకు అనుకూలంగా వ్యవహరించేందుకు, క్షేత్రస్థాయిలో వైఎస్సార్ అభిమానుల్ని సమీకరించేందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే.. సునీత ఇంటింటికీ వెళ్లి కలవడం వలన.. వివేకా హత్యలో అవినాష్ పాత్రపై ప్రజలు కూడా మండిపడుతున్నట్టుగా వినిపిస్తోంది. మొత్తానికి తన తండ్రి వైఎస్సార్ సామ్రాజ్యంగా మలచుకున్న పులివెందుల నియోజకవర్గం నుంచి.. శుక్రవారం సాయంత్రం షర్మిల తన అన్న జగన్ పరిపాలన మీద, హత్యారాజకీయాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. వైఎస్సార్ అభిమానులు అనే సంపద మీద జగన్ కెంత హక్కున్నదో.. తనకూ అంతే హక్కున్నదని మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories