బీసీలపై చంద్రబాబు మరో బ్రహ్మాస్త్రం!

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా రాష్ట్రంలోని బీసీలకు చంద్రబాబునాయుడు ఒక గొప్ప వరం ప్రకటించారు. ఎన్నికల ప్రచార పర్వంలో రోజుకు ఒక కొత్త, ప్రజాకర్షక హామీని ప్రకటిస్తూ.. ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు, తాజాగా బీసీల మీద సమ్మోహక అస్త్రాన్ని ప్రయోగించారు. ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలి తరం సామాజిక సంస్కర్త జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ బీసీలకు ఈ వరం ప్రకటించడం విశేషం. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని బాబు ప్రకటించడం ఆ వర్గాలలో హర్షాతిరేకాలకు కారణం అవుతోంది.


జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచి పెట్టడం ఒక్కటే తన పరిపాలనకు అర్థం అన్నట్లుగా ప్రవర్తించారు. ఆ ముసుగులో ప్రతి ఇంటికి డబ్బులు పంచి పెడుతున్నాననే ధీమాతో రాష్ట్ర సమీకృత అభివృద్ధిని పట్టించుకోకుండా నాశనం చేశారు. సంక్షేమ పథకాలలో దీన్ని పొందుతున్న పేదలు, లబ్ధిదారులు సమస్తం తనకు తిరుగులేని స్థిరమైన ఓటు బ్యాంకు  అవుతారని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. తను రాష్ట్రంలో ఏ అభివృద్ధిని అయితే ఇన్నాళ్లు విస్మరిస్తూ వచ్చారో, దాని గురించి ఇప్పటికి కూడా జగన్ మాటమాత్రంగానే ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు.

అదే సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇస్తూనే, ప్రజలు అలవాటు పడిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తాననే  సంగతి ప్రకటించారు. అలాగని ఆ లబ్ధిదారుల్లో జగన్ పట్ల సానుకూలత ఉంటే వారి ఓటు బ్యాంకు ను దూరం చేసుకునే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. అందుకే సంక్షేమ పథకాల అన్నింటినీ కూడా పెంచుతూ సరికొత్త హామీలను ప్రజలకు ప్రకటించారు.

వృద్ధులకు వితంతువులకు అందజేస్తున్న పింఛను ప్రస్తుతం 3000 రూపాయలు ఉండగా దానిని తమ ప్రభుత్వం లో 4000గా అందిస్తామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏప్రిల్ నుంచి అరియర్స్ కూడా చెల్లిస్తామని ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేశారు. అలాగే వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా కూడా మూడో నెలలో మొత్తం మూడు నెలల పింఛను అందిస్తామని కూడా వారిని ఆకర్షించే ఆఫర్  ప్రకటించారు. వికలాంగులకు 6000 రూపాయల పింఛను ఇస్తామని కూడా చంద్రబాబు ప్రకటన చేశారు. తాజాగా జ్యోతిబాపూలే జయంతి నాడు బీసీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామనడం ఇంకొక బ్రహ్మాస్త్రంగా పరిగణించాల్సి ఉంటుంది.

ఇప్పటికే చంద్రబాబు ప్రకటిస్తున్న వరాలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్ మరియు ఆయన అనుచరదళం.. ఇదే హామీలను తాము ప్రకటించలేక అలాగని విస్మరించనూ లేక ఆందోళనకు గురవుతున్నారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు అని జనాంతికంగా ఒక మాట చెప్పడం తప్ప.. ఆయనను ఎదుర్కోవడానికి వారి వద్ద వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories