వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నాయకుల అరాచక పోకడలకు ఇదొక పెద్ద ఉదాహరణ. ప్రజలతో మమేకం అయి ఉండాల్సిన పనిని మొత్తం వారు వాలంటీర్ల మీద పెట్టి.. ఈ అయిదేళ్ల పాటు దందాలు సాగించుకోవడంలో నిమగ్నం అయిపోయారు. నాయకులు ప్రజలను పట్టించుకోలేదు. ఆక్రమణలు, అక్రమార్జనల మీదనే వారి కాన్సంట్రేషన్ మొత్తం సాగిపోయింది. ప్రభుత్వ పథకాల్ని ప్రజల వద్దకు వాలంటీర్లు తీసుకువెళుతున్నారు కదా..
వారందరూ తమ పార్టీ కార్యకర్తలే కదా.. తమకు కొమ్ము కాయడానికే ఉన్నారు కదా.. ఇంకా ప్రజలను ప్రత్యేకంగా తాము కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది.. అని విర్రవీగారు. తీరా ఇప్పుడు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టేలా ఈసీ ఆదేశాలు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు దిక్కుతోచడం లేదు. తమ అవసరం గడిస్తే చాలు.. ఎవరి జీవితాలు ఏమైపోయినా పరవాలేదు అనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు.. తమతమ నియోజకవర్గాల్లో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు.
వాలంటీర్లను అడ్డగోలుగా ఎన్నికల పనులకు వాడుకోవడం గురించి ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వారి ద్వారా పింఛన్ల పంపిణీకి ఆల్రెడీ బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియలో కూడా వారి భాగస్వామ్యం ఉండే అవకాశం లేదు. వారి ద్వారా పథకాల లబ్ధిదార్లను ప్రలోభపెట్టాలంటే ఇక కష్టం. అందుకే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ఈ రెండు నెలల జీతం మేమిస్తాం అంటూ వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లపై ఈసీ వేటు వేస్తుండడంతో.. ఇలాంటి కుట్ర చేస్తున్నారు. రాజీనామాలు చేయించి.. వారిని ఎన్నికల ప్రచారానికి, ఆ తర్వాత ఎన్నికల ఏజంటుగానూ వాడుకోవాలని చూస్తున్నారు.
అయితే, వాలంటీర్లకు ఇష్టం లేకపోయినప్పటికీ వారితో బలవంతంగా రాజీనామలు చేయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు జీతం రూ.పది వేలు చేస్తానని చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన ఎక్కువ మందిలో కొత్త ఆశలు పుట్టించింది. వైసీపీ బలవంతం మీద వారు చెప్పిన పనెల్లా చేస్తూ వచ్చినప్పటికీ అడిగినా జీతం పెంచని జగన్ సర్కారు మీద చాలా మందిలో విముఖత ఉంది. కాగా, చంద్రబాబు వస్తే అసలు వాలంటీర్ల వ్యవస్థనే ఉంచరు. ఉంచినా సరే, ఇప్పుడున్న వారినందరినీ తొలగిస్తారు అనే దుష్ప్రచారంతో వైసీపీ నేతలు వారిని భయపెడుతున్నారు. ఉద్యోగాలు వారికి పదిలంగా ఉండాలంటే ప్రస్తుతం రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైసీపీని గెలిపించాలని ఒత్తిడి చేస్తున్నాకరు. ఈ రకంగా బలవంతం మీద వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.