గద్దె ఎక్కించినవాడే.. పతనానికి జోస్యం చెప్పాడు!

2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలను నమ్మించడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహచతురత చాలా ఉన్నదని అప్పటి వ్యవహారాలు తెలిసిన చాలామంది అంటూ ఉంటారు. ‘ఒక్క ఛాన్స్’ వంటి నాటకీయ అభ్యర్థనల నుంచి, ‘రావాలి జగన్ కావాలి జగన్’ వంటి నినాదాల రూపకల్పన వరకు , పాదయాత్ర ఆలోచనతో సహా ప్రజలను ఆకర్షించిన అనేకానేక హామీల ప్రకటన వరకు- వాటి వెనుక ప్రశాంత్ కిశోర్ నైపుణ్యాలు ఉన్నాయని చాలా మంది అంటుంటారు. ఆ స్థాయిలో జగన్ కోసం పనిచేసి, ఆయనను గద్దె మీద కూచోబెట్టిన వ్యూహకర్తే ఇప్పుడు జగన్ కు ఓటమి తప్పదని తెగేసి చెబుతున్నారు. జగన్ ఈ అయిదేళ్లలో అనుసరించిన విధానాలే ఆయన పతనాన్ని శాసిస్తున్నాయని కూడా అంచనా వేస్తున్నారు.

జగన్ తో కొంతకాలం పనిచేసిన తర్వాత గానీ.. ఆయనలో మోనార్క్ వైఖరి ఉన్నదని ప్రశాంత్ కిశోర్ కు అర్థమైనట్లు లేదు. ఆయన ముఖ్యమంత్రి లాగా కాకుండా, మోనార్క్ లాగా పరిపాలన సాగిస్తున్నారని పీకే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రభుత్వం సొమ్మును తాయిలాల రూపంలో పంచిపెట్టడం తప్ప.. జగన్ ప్రజలకు చేసిన మంచి మరేమీ లేనేలేదని చెప్పడం విశేషం. రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి పని కూడా జరగలేదని అంటున్నారు.

జగన్ పతనం ఎలా ఉంటుందో చెప్పడానికి పీకే, ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఉదాహరణ తీసుకోవడం గమనార్హం. ఆయన మాదిరిగా ప్రజలకు తాయిలాలు ఇచ్చారు తప్ప ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదని.. కేవలం నగదు బదిలీ తప్ప ఉద్యోగాల కల్పన వంటి పనులు జరగలేదని.. ఈ వైఖరి ఎన్నికల్లో గెలిపించదని ప్రశాంత్ కిశోర్ వివరించారు.


బఘేల్ తో పోల్చి తాయిలాల రాజకీయాల వల్ల జగన్ కూడా ఓడిపోతున్నారని ప్రశాంత్ కిశోర్ అంచనా వేయడం బాగానే ఉది గానీ.. వాస్తవానికి ఆయన గుర్తించని సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన నాటినుంచి జగన్ సాగించిన విధ్వంసం అరాచకాల మాటేమిటి? ఇసుక రూపేణా గానీ, లిక్కర్ వ్యాపారం రూపేణా గానీ.. ప్రతినెలా వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ వస్తున్న మాటేమిటి? అని ప్రజలు విస్తుపోతున్నారు. ఇవన్నీ కూడా ఏపీ ప్రజలు గమనిస్తున్న విషయాలే. కాకపోతే.. మధ్యలో తీర్పు చెప్పే అవకాశం వారికి ఉండదు. ఇప్పుడు తీర్పు చెప్పే సమయం వచ్చింది గనుక.. ఇన్నాళ్లు తాము గమనించిన పాపాలన్నింటికీ కలిపి ఒకే తీర్పు ఇవ్వబోతున్నారు అనే సంగతిని పీకే మిస్సయినట్లున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories