చంద్రబాబు నాయుడు పేద ప్రజలను ఉద్దేశించి అద్భుతమైన వరాన్ని ప్రకటించారు. అయితే ఆ వరం యొక్క వివరాలు పేదలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఏ వర్గంలో అయితే విష బీజాలు నాటడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నదో, అదే వర్గానికి చెందిన పేద ప్రజలకు చంద్రబాబు ఇస్తున్న హామీ యొక్క గొప్పతనాన్ని చేరవేయవలసిన అవసరం పార్టీ కార్యకర్తల మీద ఉంది.
జగన్మోహన్ రెడ్డి తరఫున విషప్రచారాలను కొనసాగించడానికి వాలంటీర్ల వ్యవస్థ క్షేత్రస్థాయి వరకు బలంగా ఉండగా- వారికి విరుగుడుగా పార్టీ కార్యకర్తలే బాబు మాటలను ఇంటింటికీ తెలియజెప్పాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకూ చంద్రబాబునాయుడు ఏం చెప్పారంటే..
వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇతరత్రా సంక్షేమ పథకాల పింఛన్లు పొందుతున్న వారికి తమ ప్రభుత్వం లో నాలుగు వేల రూపాయల వంతున పింఛను ఇస్తానని అంటున్నారు. కేవలం 1000 రూపాయలు పించనను పెంచుతానని చెప్పడం మాత్రమే కాదు. ఆ పెంపును ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి కూడా లెక్కించి ఇస్తానని ప్రకటించడం విశేషం. అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి గనుక ఆ తరువాతే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడం జరుగుతుంది. అప్పటికే జూన్ నెలలో పింఛన్ల పంపిణీ కూడా పూర్తయి ఉంటుంది.
అయితే జూలై నెలలో ఇచ్చే 4000 పెన్షన్ తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు అదనంగా కలిపి ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. అదే సమయంలో పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల ఇళ్ల వద్దకే ఒకటవ తేదీనే తీసుకువెళ్లి ఇస్తాం అని చంద్రబాబు ప్రకటించేశారు.
పింఛనుదార్లకు ఆశపుట్టేలా చంద్రబాబు మరో సంగతి కూడా ప్రకటించారు. రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం సొమ్ములు ఇస్తాం అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక్కనెల పింఛనుకు అందుబాటులో లేకపోయినా.. వారి పింఛనును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసేస్తోంది. దీనివల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యకారణాలు, కుటుంబ బంధాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండే పింఛనుదార్లు ఒకటోతేదీకెల్లా.. ఆపసోపాలు పడుతూ స్వగ్రామానికి రావడం మళ్లీ వెళ్లడం జరుగుతోంది. ఈ కర్చులకే వారికి పింఛను డబ్బులు ఖర్చయిపోతున్నాయి. కానీ పింఛను వదిలేసుకుంటే.. ఇతర ప్రభుత్వ పథకాలు కూడా చేజారిపోతాయేమోననే భయంతో వారు వచ్చేది రూపాయి లేకపోయినా.. పింఛను తీసుకుంటూనే ఉన్నారు. అలాంటి వారికి రెండు నెలలు మిస్సయినా సరే మూడో నెలలో మొత్తం మూడు నెలల పింఛను ఇచ్చేస్తాం అని చంద్రబాబు ప్రకటించడం వరమే అని చెప్పాలి.
నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- పింఛన్లు పెంచుతాన్న చంద్రబాబు సవాల్ ను స్వీకరించే స్థితిలో లేదు. ఆ సవాలుకే వారు భయపడుతూ ఉండగా, అదనంగా ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇస్తానని ప్రకటించడం అధికారంలోకి వచ్చిన తర్వాత- ఏప్రిల్ నుంచి బకాయిలను కూడా లెక్క కట్టి జూలై నెలలోనే అందజేస్తారని అనడం ప్రజలను ఆకర్షించే విషయం. అందుచేతనే పార్టీ కార్యకర్తలు శ్రద్ధ తీసుకుని చంద్రబాబు నాయుడు పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రకటించిన ఈ అద్భుతమైన వరం గురించి ఇంటింటికీ తెలియ చెప్పవలసిన అవసరం ఉన్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి!