తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అపరిమితమైన జనాదరణను వాడుకుంటూ కడప అనేది తనకు ఒక బలమైన నియోజకవర్గంగా చెలరేగుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తండ్రి వారసత్వం అన్నట్లుగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తాను పుచ్చుకున్నప్పటికీ, తమ కుటుంబానికి ఎంతో సుస్థిర నియోజకవర్గంగా తండ్రి తయారుచేసిన కడప పార్లమెంటు స్థానాన్ని అటు చిన్నాన్న వివేకానంద రెడ్డికి దక్కకుండా, అలాగని చెల్లెలు షర్మిలకు కూడా చిక్కనివ్వకుండా- అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే జనాదరణ తన వైపే ఉంటుందని, తన మాటకు ఎదురు చెప్పేవారు అక్కడ ఎవరూ ఉండరు అనేది జగన్మోహన్ రెడ్డి అహంకారంగా పలువురు భావిస్తారు. ఇప్పుడు అదే కడప ఎంపీ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభం అవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్సార్ కూతురు షర్మిల పోటీ చేస్తున్నారు. నిజానికి షర్మిల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అనేది ప్రాధాన్యాంశం కానే కాదు. ఎందుకంటే వైయస్సార్ కూతురుగా ఆమెకు దక్కగలిగిన ప్రజాదరణ పార్టీలకు అతీతమైనది. ఆ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే తమ నాయకుడికి వారసుడిగా చూసారో- వైఎస్ షర్మిలను కూడా అంతే ప్రేమతో చూస్తారు. జగన్ స్వయంగా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే అడ్వాంటేజ్ ఆయనకే ఉండేదేమో కానీ అవినాష్ రెడ్డిని బరిలోకి దించి అతనికి ఓట్లు వేయమని జగన్ అడిగినంత మాత్రాన వైఎస్ఆర్ అభిమానులు ఆమోదించలేకపోవచ్చు. బరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాకుండా మరొకరు ఉంటే జగన్ పాచికపారేది కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. వైయస్సార్ అభిమాన గణం యావత్తూ వైయస్సార్ బిడ్డగా, చిన్నాన్న హంతకులను ఓడించడానికి ఇక్కడ పోటీ చేస్తున్నా అని చెప్పుకుంటున్న షర్మిల కు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది.
షర్మిల- చిన్నాన్నను హత్య చేసిన వారి గురించి, సదరు హత్యా రాజకీయాల గురించి ఇన్నాళ్లు మాట్లాడిన పద్ధతి వేరు.. కడప ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటితం కాగానే మాట్లాడిన పద్ధతి వేరుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె ఎలాంటి మొహమాటానికి పోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి డొంకతిరుగుడుగా ‘చిన్నాన్నను చంపింది ఎవరో అందరికీ తెలుసు’ అని మాట్లాడుతోంటే షర్మిల చాలా సూటిగా కొరడాతో కొట్టినట్టుగా ‘చిన్నాన్నను చంపించిన అవినాష్ రెడ్డి ని ఓడించాలి’ అని అంటున్నారు. ముందు ముందు ఎన్నికల ప్రచారంలో ఆమె అవినాష్ రెడ్డి మీద మరింతగా విరుచుకు పడే అవకాశం ఉంది. చంపిన వ్యక్తికి రెండోసారి టికెట్ ఇచ్చి గెలిపించాలని చూస్తున్న జగనన్న తీరును కూడా ఆమె తొలి రోజునే ఎండగట్టారు. ముందు ముందు మరింతగా దునుమాడుతారు.
కడప ఎంపీ రాజకీయాల ప్రభావం యావత్తు రాష్ట్రం మీద ఉంటుందని అనలేం. అలాంటి అనుభవాలు గత చరిత్రలో ఎప్పుడూ లేవు. అయితే ఈసారి పరిస్థితి వేరు. వైఎస్ షర్మిల- సొంత అన్న తనకు ద్రోహం చేశాడని చిన్నాన్న హంతకులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఆమె కడప వేదిక మీద ఈ మాట పలికినా సరే ఆ స్వరం రాష్ట్రమంతా వినిపిస్తుంది. రాష్ట్రమంతా ప్రజలను ఆలోచింపజేస్తుంది.. అనే సంగతి మనం గమనించాలి. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలలో కొత్త అనుమానాలు పుడితే గనుక ఆయన మాటలలో మాయ ఉన్నదని అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు అనుమానిస్తే గనుక వాటి వెనుక షర్మిల మాటల ప్రభావం ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యంగా కడప గడప నుంచి ఈసారి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పతనానికి సొంత చెల్లెలు షర్మిల శ్రీకారం చుట్టబోతున్నారని ప్రజలు భావిస్తున్నారు.