స్నేహపూర్వక అంటే.. బిజెపి గొయ్యి తవ్వుకోవడమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా నికరం ఉన్నదో లేదో చెప్పలేం గానీ.. ఎన్నికలు వచ్చేసరికి  మాత్రం రకరకాల ఓవరాక్షన్  చేస్తున్నారు. తెలుగుదేశంతో పొత్తులు కుదిరే వరకు రాష్ట్రంలోని ప్రతి బిజెపి నాయకుడు కూడా.. ఆ విషయం అధిష్ఠానం చూసుకుంటుంది, అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటాం, మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, అనే రకరకాల పడికట్టు డైలాగులు వేశారు. తీరా పొత్తులు కుదరిన తర్వాత..  మాట మారుస్తున్నారు. అధిష్ఠానం అభిప్రాయాలు సేకరించినప్పుడు మొత్తం 175 నియోజకవర్గాల నాయకులు అందరూ కూడా.. పొత్తులు వద్దని అభిప్రాయాలు పంపారని, మరి పొత్తులు ఎలా కుదిరాయో తెలియదని, పార్టీ బలపడాలంటే.. కనీసం స్నేహపూర్వక పోటీకి అయినా అనుమతించాలని కొందరు కమల నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

స్నేహపూర్వక పోటీ పేరుతో ఎవ్వరు బరిలోకి దిగినా.. కూటమి విజయావకాశాలకు అది గొడ్డలిపెట్టుగా మారుతుందనే సంగతి అందరికీ తెలుసు. ఒకవైపు పవన్ కల్యాణ్ వంటి నాయకుడు.. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలడానికి వీల్లేదు అనే ఏకైక లక్ష్యంతోనే పొత్తులకు పూనిక వహించారు. చాలా సుదీర్ఘ మంతనాల తర్వాత.. మూడు పార్టీలు కలిసి రాష్ట్ర విస్తృతప్రయోజనాలను లక్ష్యిస్తూ ఈ పొత్తులకు దిగాయి. తీరా ఇప్పుడు బిజెపి వైపు నుంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల్లో రెండు రకాల చర్చ నడుస్తోంది. ఒకటి బిజెపి నాయకుల్లో స్నేహపూర్వక పోటీ అనే పాట పాడుతున్న నాయకుల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రేరేపణ ఉందన్నది. వైసీపీ నాయకులే, కమలనేతలను ప్రలోభపెట్టి, రెచ్చగొట్టి, కీ యిచ్చి వారితో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారనేది ఒక అభిప్రాయం.
రెండోది.. రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా స్నేహపూర్వక పోటీ అంటూ ఏ ఒక్క బిజెపి నాయకుడు బరిలోకి దిగినా.. రాష్ట్రవ్యాప్తంగా వారు పోటీచేస్తున్న పది అసెంబ్లీ, ఆరు ఎంపీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ మట్టికొట్టుకుపోతుందని కూడా అంటున్నారు. స్నేహపూర్వకపోటీ అంటూ.. ఎవడికైనా పార్టీ కమలం గుర్తును, బీఫారంను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు గాక.. పోటీకి ఎవరైనా దిగితే.. అదే మాదిరిగా తెలుగుదేశం నాయకులు ప్రతిచోటా పోటీకి దిగుతారు. మొత్తంగా అసలు కూటమి ప్రయోజనాలే దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి ఓవరాక్షన్ చేయకుండా.. కమల నాయకులు పరిస్థితుల్ని అర్థం చేసుకుని కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఒకరికొకరు సహకరించాలని పలువురు సూచిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories