రఘురామ చేస్తున్న తప్పు ఏంటంటే..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి ఎంపీగా గెలిచి, లోక్ సభలో అడుగుపెట్టిన రఘురామక్రిష్ణరాజు ఇప్పుడు ఒంటరి అయ్యారు. ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసమే తాను ఒంటరిపోరాటం చేస్తున్నానని ఆయన వెల్లడించారు. తనను చంపడానికి ప్రయత్నించినా సరే, పోలీసులతో అరెస్టు చేయించి దారుణంగా కొట్టించినా సరే.. తాను మాత్రం జగన్మోహన్ రెడ్డిమీద మడమ తిప్పని పోరాటం చేస్తున్నానని ఆయన వెల్లడించడం విశేషం. జగన్ మీద ఆయన ఎలాంటి ఆరోపణలు చేశారు.. అనేది కాసేపు పక్కన పెడదాం. అయితే ఆయన ఎందుకు  ఒంటరి అయ్యారు అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది.
రఘురామక్రిష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ.. తొలిరోజుల్లోనే ఆ పార్టీతో వైరం ఏర్పడింది.

ముఖ్యమంత్రి జగన్ తో సున్నం పెట్టుకున్నారు. అప్పటినుంచి కూడా విపక్షాల్లోని అన్ని పార్టీలతోనూ ఆయన చాలా దగ్గరి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఎటూ ఎంపీ హోదాలో ఢిల్లీలోనే ఉంటున్నారు గనుక.. ఆయన భారతీయ జనతా పార్టీలోని పెద్దలతో గుడ్ రిలేషన్స్ లో ఉంటూ వారికి తరచుగా విందులు ఏర్పాటు చేస్తుంటారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళితే.. ఆయనకు రూములు కూడా తానే ఏర్పాటుచేస్తానని రఘురామ స్వయంగా చెప్పుకున్నారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వెళ్లినా కూడా ఎయిర్ పోర్ట్ వద్దనుంచి స్వాగతం చెప్పి.. వెంట తిరుగుతూ ఉంటారు. ఇలా అందరితోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

అందుచేతనే.. తాను నరసాపురం నుంచే మళ్లీ బరిలో ఉంటానని ఘంటాపథంగా తేల్చి చెప్పి.. ఏ పార్టీ తరఫున అనేది తర్వాత చెబుతానని ఆయన అనగలిగారు. పొత్తుల్లో ఆ సీటు ఏ పార్టీకి దక్కుతుందో వేచిచూడాలని అనుకున్నారు. ఏపార్టీకి ఆ సీటు దక్కినా.. తనను కాదని మరొకరికి కేటాయించేంత దమ్ము వారికి ఉండదు కదా అని ధీమాగా ఉండిపోయారు. కానీ.. చాలామంది ఊహించినట్టే ఆ సీటు తీసుకున్న బిజెపి ఆయనను పక్కన పెట్టి మరోనాయకుడికి టికెట్ ఇచ్చింది. అందుకు జగన్ కారణం అంటూనే.. కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల టికెట్ మిస్సయిందని, చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని అంటున్నారు.

అయినా సరే.. రఘురామక్రిష్ణ రాజు ఇప్పటికీ తప్పు చేస్తూనే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు మీద అంత నమ్మకం ఉంటే.. ఇప్పటికైనా ఆయన తెలుగుదేశంలో చేరాలి. ఇప్పటికిప్పుడు టికెట్ దక్కే దశ దాటిపోయి ఉండవచ్చు. కానీ టికెట్ తో ముడిపెట్టకుండా కూటమి విజయం కోసం ఆయన శక్తివంచన లేకుండా రాష్ట్రమంతా తిరిగి స్టార్ కాంపెయినర్ లాగా పనిచేయాలి. అలా చేస్తే పార్టీలు కూడా ఆయన సేవలను గుర్తుంచుకుంటాయి. అలాంటి నిర్ణయం ఇంకా తీసుకోకుండా.. ఏ పార్టీలోనూ చేరకుండా.. నాకు న్యాయం జరుగుతుంది.. నేను పోటీచేస్తా అని పడికట్టు మాటలు మాట్లాడడం వల్ల.. ఏ పార్టీ కూడా ఆయనను ఆదరించదు అని తెలుసుకోవాలి. ఆ పొరబాటును ఆయన దిద్దుకోవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories