వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన.. పెన్షనర్లు నానా అవస్థలు పడాల్సిందేనా? ప్రభుత్వ యంత్రాంగం పెన్షన్లను ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వడం సాధ్యమే కాదా? ఒక బూటకపు ఇబ్బందిని కృత్రిమంగా సృష్టించి.. ఆ ఇబ్బందికి చంద్రబాబునాయుడు కారకుడు అంటూ ఒక విషప్రచారం సాగించి.. రాజకీయంగా లబ్ధిపొందాలని చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు ఫలించడం లేదు. చంద్రబాబునాయుడు ఎలాంటి ప్రతిపాదన అయితే చేశారో.. ఆ ప్రతిపాదనకే రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు అందరూ జై కొడుతున్నారు. పెన్షనర్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. ఇంటివద్దనే అందుకునే సదుపాయమే కోడ్ అమల్లో ఉన్న ఈ రెండునెలల్లో కూడా జరగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మార్గదర్శకాలు జారీచేయబోతున్నారు.
వాలంటీర్లను ఇంటింటికీ పంపుతూ వారిద్వారా పెన్షన్లు అందజేయిస్తూ, అదే సమయంలో వారి ద్వారా పెన్షన్ లబ్ధిదారుల వద్ద జగన్ భజన చేయిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని వైసీపీ కుట్ర చేసింది. ఈ రెండు నెలల్లో వాలంటీర్లు తమకు బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో వైసీపీ అభ్యర్థులు వాలంటీర్లకు విచ్చలవిడిగా కానుకలు, తాయిలాలు, నగదు అందజేశారు. అయితే సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ తరఫున మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తల్లా ప్రచారాలు చేస్తున్నారని, పెన్షన్లు ఇచ్చే పని నుంచి ఈ రెండు నెలలు వారిని దూరం పెట్టాలని రాశారు. ఈసీ తదనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఆ వెంటనే.. చంద్రబాబునాయుడు తొలుత స్పందించారు. వాలంటీర్లను దూరం పెట్టడం వలన.. పెన్షన్ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. గ్రామ సచివాలయాల సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా.. ఇంటింటికీ పెన్షన్లు చేర్పే ఏర్పాట్లు చూడాలని ఆయన సీఎస్ జవహర్ రెడ్డికి, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈలోగా సెర్ప్ సీఈవో పింఛను లబ్ధిదారులు అందరూ గ్రామ సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటూ ఒక ఉత్తర్వు విడుదల చేశారు. ఇది వివాదాస్పదం అయింది.
ఆ పిమ్మట, పింఛన్ల పంపిణీ గురించి సీఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయవచ్చునని మెజారిటీ కలెక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. తదనుగుణంగా సీఎస్ ఆదేశాలు ఇవ్వనున్నారు. దాంతో చంద్రబాబునాయుడు సిఫారసు చేసిన పద్ధతికే కలెక్టర్లు అందరూ జై కొట్టినట్టు అవుతోంది.