ఖాళీ ఎక్కువైపోయి.. చంద్రబాబు మీద బురద!

ఖాళీగా ఉండే బుర్ర దెయ్యాల కొంప లాంటిదని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. పనిలేకుండా ఖాళీగా ఉండే నాయకుడి పరిస్థితి కూడా అంతే. ఏ పనీ లేననప్పుడు.. అలాంటి నాయకుడు సమాజానికే చేటు చేసే విషపురుగులాగా మారుతాడు. ఏదో  ఒకటి కెలుకుతూనే ఉంటాడు. కిట్టని వాళ్ల మీద నిత్యం బురదచల్లడంలోనే ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. ఎందుకంటే.. పని ఉన్న నాయకులు.. పనిలో నిమగ్నం అవుతారు.. పనిలేనివారు బురదచల్లడంలోనే తరిస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పేర్ని నాని పరిస్థితి అలాగే ఉంది.

ఆయనకు ప్రస్తుతానికి పనిలేదు. సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పనిచేసిన పేర్ని నాని.. రాబోయే ఎన్నికల్లో తనకు ఓటమి గ్యారంటీ అనే సంగతి చాలాకాలం ముందుగానే గ్రహించిన వాడై.. పోటీనుంచి తప్పుకున్నారు. తప్పటడుగుతో మొదలైనా కెరీర్ కు పెద్ద నష్టం లేదులెమ్మని ఎమ్మెల్యే టికెట్ ను తన కొడుక్కి ఇప్పించుకున్నారు. ఆ రకంగా ప్రస్తుతానికి ఖాళీగా కూర్చున్నారు. ఎందుకంటే.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లి సాధించేది కూడా ఏమీలేదని ఆయనకు తెలుసు. చేతినిండా పనిలేకపోవడం చేత.. పొద్దుపోక ఆయన ఎడాపెడా చంద్రబాబును తిట్టిపోయడానికి మాత్రం పరిమితం అవుతున్నారు. ప్రతిరోజూ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం, ఒక సుదీర్ఘమైన స్క్రిప్టు ప్రకారం ప్రత్యర్థులను తిట్టిపోయడం మాత్రమే ఆయన పని.

వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరగరాదనే ఈసీ ఉత్తర్వులను ఖండిస్తూ పేర్ని నాని  నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మళ్లీ ఇవాళ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కంటెంట్ లో ఏమీ తేడా లేదు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వృద్ధుల చేతికే పెన్షను అందజేస్తోంటే చంద్రబాబు అడ్డుపడ్డారు అని విమర్శించడం మాత్రమే. వాలంటీర్ల ద్వారా వృద్ధులను ప్రలోభపెట్టే పార్టీ కుట్రలకు ఈసీ ఆదేశాలతో చెక్ పడేసరికి పేర్నినానికి మైండ్ బ్లాక్ అయినట్టుంది. అందుకే రెండు రోజులూ ఒకే కంటెంట్తో  చంద్రబాబు మీద బురద చల్లుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

అదే సమయంలో- 55 నెలలు వాలంటీర్లు ఇంటింటికీ పింఛన్లు ఇచ్చారని, జగన్ డబ్బు పంపుతున్న సంగతి ప్రజలకు తెలియదా? అని కూడా పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రజలకు తెలుసు కదా.. ఈ రెండు నెలలు కోడ్ కారణంగా వాలంటీర్లను దూరం పెట్టమని చెబితే.. వారు ఉడుక్కోవడం ఎందుకో ప్రజలకు అర్థం కావడం లేదు. అయినా.. జగన్ తన జేబులోని డబ్బును గానీ, తన వ్యాపారాల్లో లాభాల నుంచి వచ్చే డబ్బు గానీ.. మూడువందల పైచిలుకు కోట్ల రూపాయలు పార్టీకి చందాలుగా పొందిన మొత్తం నుంచి గానీ పింఛన్లు ఇవ్వడం లేదు కదా అని కూడా జనం అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories