పెన్షన్లు అందకూడదనే జగన్ కోరిక!

ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిబంధన పెడితే.. పార్టీలన్నీ కూడా దానిని గౌరవించాలి. తదనుగుణంగా నడుచుకోవాలి. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోక తప్పేదేమీ లేదు. కాకపోతే.. ఆ ఆదేశాలను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి దళం ప్లాన్ చేస్తున్నది. అవసరమైతే అందుకు రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న పేదలందరి జీవితాలను పణంగా పెట్టడానికి కూడా జగన్ సర్కారు వెనుకాడడం లేదు. అసలు పేదలకు పెన్షన్లు అందకుండానే చూడాలి. తప్పనిసరిగా అందించాల్సి వస్తే.. వీలైనంత జాప్యం చేయాలి… ఇదీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి స్కెచ్.

ఎన్నికలు పూర్తయ్యేదాకా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయించడానికి వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  మామూలుగా ఒకటోతేదీనుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంటుంది. ఈదఫా కనీసం ఇప్పటిదాకా పెన్షన్లు ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదని వార్తలు వస్తున్నయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ మాయమాటలు చెప్పుకుంటూ తిరగడంపై పెడుతున్న శ్రద్ధ, పెన్షన్లకు డబ్బు సిద్ధం చేయకపోవడంపై పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే నిధులను అందుబాటులో ఉంచకపోవడం కూడా.. ఒక వ్యూహం ప్రకారం చేస్తున్న కుట్ర అని వార్తలొస్తున్నాయి.

చంద్రబాబునాయుడు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి స్పష్టమైన లేఖ రాశారు. గ్రామాల్లోని సచివాలయాల ఉద్యోగుల ద్వారా.. లబ్ధిదారుల ఇంటింటికీ ఒకటోతేదీనుంచి యథావిధగా పెన్షన్లు అందేలా చూడాలని ఆయన కోరారు. కానీ ప్రభుత్వం డబ్బులే సిద్ధం చేయకపోతే వారు ఎలా వేయగలరు? అసలు డబ్బు రెడీ చేయకుండా.. సీఎస్ పెన్షన్లు పూర్తిగా ఇవ్వాలంటే కనీసం పదిరోజులు పడుతుందని ఏ అంచనాతో చెబుతున్నారో కూడా తెలియదు. అదే సమయంలో.. ఇలాంటి నిబంధన వల్ల.. అవ్వలు తాతలు పంచాయతీ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని, దీనివల్ల ముసలివాళ్లను నానాయాతన పెట్టినట్టు అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాపం సానుభూతి చూపిస్తున్నారు. ఇలాంటి మాటల ద్వారా.. సచివాలయ సిబ్బందినే ఇళ్లకు పంపి ఇవ్వడం అనే ప్రయత్నం చేయకుండా.. అధికారులను బెదిరిస్తున్నట్టుగా ఉంది.

అసలు పేదలకు ఈ నెలలో పెన్షన్లు అందకుండా చేస్తే.. ఆ పాపం మొత్తం చంద్రబాబు మీదికి నెట్టేయవచ్చుననేది జగన్ దళం  ఆలోచనగా ఉంది. ఇప్పటికే వాలంటీర్ల ద్వారానే ఆ ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అసలు పెన్షన్లు ఉండనే ఉండవని కూడా అదే వాలంటీర్లతో వైసీపీ పార్టీ దుష్పచారం చేయిస్తున్నట్టుగా వాట్సప్ గ్రూపుల్లో పురమాయింపుల వల్ల అర్థమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories