కడప బరిలో షర్మిలే! అవినాష్‌కు దబిడి దిబిడే!

ఈసారి ఎన్నికల్లో బాగా ఆసక్తికరంగా మారబోయే నియోజకవర్గాల్లో కడప ఎంపీ సీటు కూడా ఉంది. వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డినే మళ్లీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేశారు. ఆయనకోసం ఆల్రెడీ ఒక ఎన్నికల ప్రచార సభకూడా నిర్వహించారు. అవినాష్ మీద హత్యసూత్రధారి అనే మరకను చెరిపివేయడానికేనా అన్నట్టుగా.. అసలు హంతకులు ఎవరో ప్రజలకు తెలుసునని, ఆ హంతకులను కాపాడుతున్నది ఎవరో కూడా తెలుసునని చంద్రబాబు మీద బురద చల్లడానికి కూడా జగన్ ప్రయత్నించారు. తమ్ముడు అవినాష్ రెడ్డిని మళ్లీ ఎంపీ చేయడానికి పాపం జగన్ ఎంతగా తపన పడుతున్నప్పటికీ.. అక్కడి పరిస్థితులు అంతగా సహకరించడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ బరిలోకి వైఎస్ షర్మిల స్వయంగా దిగే అవకాశం ఉన్నదని వార్తలు వస్తుండడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమే.

రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అదృశ్యమైపోయింది. నాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారికి ఇక్కడ ఓట్లు పడలేదు. కానీ.. ఈసారి షర్మిలను స్వయంగా పోటీకి దింపడం ద్వారా తిరిగి ఏపీలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. వివేకానందరెడ్డి భార్య, కూతురులను పార్టీలోకి తీసుకుని పోటీచేయించాలని తొలుత అనుకున్నారు. అప్పుడైతే షర్మిల రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయవచ్చునని కూడా అనుకున్నారు. అయినా అధిష్ఠానం వ్యూహం మరోరకంగా ఉంది. షర్మిల ప్రచారం నిర్వహించినంత మాత్రాన రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఒక్కసీటు అయినా దక్కే అవకాశం లేదు. దాని బదులుగా.. కడప ఎంపీ బరిలో షర్మిలనే దించితే.. గట్టిగా ఫోకస్ పెడితే గనుక.. ఆ సీటు దక్కుతుంది అని ఆశపడుతున్నారు.

కడప ఎంపీ బరిలో స్వయంగా వైఎస్ షర్మిల పోటీచేస్తే.. వైఎస్ అవినాష్ కు దబిడిదిబిడే అని పలువురు అంచనా వేస్తున్నారు. షర్మిల మామూలుగానే చాలా పదునుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనను దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా చిన్నాన్నను చంపించిన హంతకుడిగా అవినాష్ పాత్రను కూడా తీవ్రగా ఆక్షేపిస్తున్నారు. ఆమె ఎన్నికల బరిలోకి దిగితే గనుక.. ఇంకా  ఘాటుగా విమర్శనాస్త్రలున సంధిస్తారని, ఆమెను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అవినాష్ మరియు జగన్ కోటరీ పడుతుందని అంచనా వేస్తున్నారు.

కడప ఎంపీ స్థానం వరకు రాజశేఖర రెడ్డి అభిమానులు పుష్కలంగా ఉంటారు. ఆయన పిల్లల పట్ల వారికి అభిమానం కూడా ఉంటుంది. జగన్ మరో వ్యక్తిని నిలబెట్టి ఓట్లు వేయమంటే ఎంత ప్రభావం చూపగలరో.. జగన్ చెల్లెలు షర్మిల స్వయంగా పోటీచేసి ఓట్లు అభ్యర్థిస్తే ఆ ఫలితం వేరే ఉంటుందని, గెలుపు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. అవినాష్ రెడ్డి అవకాశాలను ఆమె దారుణంగా దెబ్బకొట్టి పరాజయం పాల్జేయగలరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ సంక్షోభాన్ని అవినాష్ ఎలా తట్టుకోగలడో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories