పరిటాల శ్రీరాం సహకారం అపూర్వం!

ఎన్నికల్లో పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు.. టికెట్లు ప్రకటించే సమయానికి నాయకుల్లో కొంతమేర అసంతృప్తులు ఉండడం సహజం. ప్రారంభం నుంచి ఉండే పొత్తులే అయితే పెద్దగా ఇబ్బంది లేదు. సరిగ్గా ఎన్నికల ముందు పొత్తులు కుదిరితే.. అప్పుడు సీట్లు పంచుకోవడం వలన.. నియోజకవర్గాల్లో అప్పటిదాకా పనిచేసుకుంటూ వచ్చిన నాయకులు షాక్ తింటారు. అసంతృప్తికి గురవుతారు.. తిరగబడతారు.. పొత్తు పార్టీని ఓడించడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అలాంటివారిని ఆయా పార్టీలు ఎంత మేర బుజ్జగించాయి అనేదానిమీదనే పొత్తులు పెట్టుకున్న కూటమి విజయం ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు ఏపీలో జగన్‌ను ఓడించాలనే కృతనిశ్చయంతో తలపడుతున్న ఎన్డీయే కూటమి విషయంలో కూడా అంతే. పలు నియోజకవర్గాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయా పార్టీల నాయకులు బుజ్గగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్‌కు, ఆస్థానాన్ని పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించడంతో భంగపాటు తప్పలేదు.

అయినాసరే.. ఆయన అక్కడ తెలుగుదేశం శ్రేణులందరినీ ఉత్తేజపరుస్తూ కూటమి అభ్యర్థి విజయానికి తామంతా కలసికట్టుగా పాటుపడాలని చెబుతున్న స్ఫూర్తిని గమనిస్తూ అపూర్వం అనిపిస్తోంది. టికెట్ ఆశించి నిరాశపడిన పరిటాల శ్రీరామ్.. పూర్తి స్థాయిలో అక్కడ బిజెపి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విజయం కోసం పనిచేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో శ్రీరాం ఒక సమావేశం నిర్వహించారు. ఏదో ముఖస్తుతి కోసం పాజిటివ్ గా మాట్లాడుతున్నారని అనుకోవడానికి ఆ సమావేశంలో సత్యకుమార్ కూడా లేరు. అయినాసరే, శ్రీరాం  పార్టీ వారందరికీ ఒకటే చెప్పారు. ‘ఎవరు అభ్యర్థి అనేది మనం పట్టించుకోవాల్సిన అంశం కానేకాకూడదు. కూటమి అభ్యర్థిని గెలిపించడం మాత్రమే మన బాధ్యత. కార్యకర్తలందరూ కష్టపడి సత్యకుమార్ ను గెలిపించడానికి పనిచేయండి. ఆయన గెలుపు ద్వారా మన ధర్మవరం పేరు ఢిల్లీలో ప్రతిధ్వనించాలి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నేను చూసుకుంటాను. నన్ను దాటిన తర్వాతే మీదాకా సమస్య రాగలుగుతుంది’ అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నెలరోజులుగా అంతా కామ్ గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి తోకజాడిస్తున్నారని.. అయితే వారందరికీ కూడా మీరు ఒక హెచ్చరిక చేయాలని శ్రీరామ్ కార్యకర్తలకు చెప్పారు. మీరు సత్యకుమార్ ను చూడొద్దు.. ఆయన వెనుక ఉన్న శ్రీరామ్ ను చూడండి అని వారికి చెప్పండి అంటూ హెచ్చరించారు.

మొత్తానికి ఈస్థాయిలో పొత్తుల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు  అభ్యర్థులకు కలసికట్టుగా పనిచేస్తే.. కూటమి విజయం సునాయాసం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories