ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి వెళ్లినా సరే.. ఊరంతా అప్రకటిత కర్ఫ్యూ ఉండేది. జగన్ ప్రయాణించే మార్గాల్లో దుకాణాలు మూయించేవాళ్లు, చెట్లు నరికించే వాళ్లు, జనం పొరబాటున కూడా రోడ్డు మీదకిరాకుండా బారికేడ్లు కట్టేవాళ్లు, పైపెచ్చు ఆయనను చూడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరదాలు కట్టేవాళ్లు..! చరిత్రలో ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి ఈ తరహాలో ఊర్లలో పర్యటించడాన్ని ప్రజలు ఎరగరు. వారంతా ఛీత్కరించుకున్నారు.
అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే.. జగన్మోహన రెడ్డి ఏమాత్రమూ అమాయకమైన నాయకుడు కాదు. పరదాలు కట్టకపోతే, బారికేడ్లు కట్టకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ప్రజలు రోడ్డు మీదకు వచ్చి తనకు అవమానకరమైన రీతిలో నిరసనలు తెలియజేస్తారని ఆయనకు తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. నిజానికి బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బు వేయడం అనేదానికి ఒక్కోసారి ఒక్కోఊరిలో సభ పెట్టడం అనవసరం. తాడేపల్లిలో కూచుని ప్రతిసారీ ఆ పనిచేయవచ్చు. కానీ.. సభ పెట్టడం.. డ్వాక్రా మహిళలందరినీ బలవంతంగా ఆ సభకు తోలడం.. వారి ఎదుట ఒక ప్రసంగం వినిపించడం తప్ప.. జనంలోకి వెళ్లడానికి జగన్ ఇన్నాళ్లూ భయపడిపోయారు.
ఆయన భయాలే ఇప్పుడు ఎన్నికల సమయంలో నిజం అవుతున్నాయి. ఆయన ఇప్పుడు ప్రజల్లో తిరగాల్సి వచ్చేసరికి ప్రజల నిరసనల్ని చవిచూస్తున్నారు. బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్ జగన్ కు చేదు అనుభవాలు తప్పడం లేదు. అసలే సభలకు జనం రావడం లేదు మొర్రో అనే అసహనం ఒకవైపు కాగా.. ప్రజల నిరసనలు మరోవైపు. నిన్నటికి నిన్న జగన్ బస్సు వస్తున్న మార్గంలో గ్రామాల మహిళలు ఖాళీ బిందెలతో వాహనానికి అడ్డు నిలిచి.. తమ నిరసనను, తాగునీటికి దిక్కులేదనే ఆవేదనను తెలియజేశారు.
ఆ అనుభవం రాగానే.. అప్రమత్తమైన పోలీసులు ఇవాళ జగన్ ప్రయాణించే మార్గంలో కూడా మహిళలు ఖాళీ బిందెలతో తయారయ్యారు. పోలీసులు వారినుంచి బలవంతంగా బిందెలను లాక్కునేశారు. అయినాసరే మహిళలు ఖాతరు చేయలేదు. జగన్ బస్సు వస్తుండగా అడ్డుపడి.. బస్సును ఆపు చేయించారు. తమ తాగునీటి సమస్యను జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలనుకున్నారు. జగన్ మాత్రం బస్సు దిగనేలేదు. బస్సులోంచి ఒక మహిళా వైసీపీ నాయకురాలు కిందికి దిగి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు తగ్గకపోవడంతో.. చివరికి జగన్ బస్సు దిగాల్సి వచ్చింది. ఆయన మొక్కుబడిగా మీ సమస్యను పరిష్కరిస్తా అని పొడిగా ఒక మాట చెప్పి తిరిగి బస్సు ఎక్కేశారు. పోలీసులు బలవంతంగా మహిళల్ని తొలగించడంతో బస్సు మళ్లీ కదిలింది.
ఇలాంటి ప్రతిఘటనలు, పరువుపోయే వ్యవహారాలు పుష్కలంగా ఉంటాయని తెలిసిన నాయకుడు గనుకనే ఇన్నాళ్లూ బారికేడ్లు, పరదాలు కట్టుకుని తిరుగుతూ గడిపారని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు