అసలే టీచర్లు.. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీచరు కమ్యూనిటీలో ప్రభుత్వ వ్యతిరేకత పుష్కలంగా ఉండగా, టీచర్లు కాగోరే నిరుద్యోగుల కమ్యూనిటీలో కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కసారి కూడా టీచరు ఉద్యోగాల నియామకాలు చేపట్టలేదు. తీరా ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో.. కేవలం 6100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఆ పరీక్షల నిర్వహణను, టెట్ ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఎన్నికల ముందు టీచరు పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా నిరుద్యోగ టీచర్లను మాయ చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టేసింది.
అదే సమయంలో నిరుద్యోగ టీచర్లలో సరికొత్త ఆశలకు చంద్రబాబునాయుడు ఊపిరులూదుతున్నారు. ఇరవై ముప్పయివేల ఖాళీలు ఉండగా.. కేవలం 6100 టీచరు పోస్టుల భర్తీకి మాత్రమే జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అదే చంద్రబాబునాయుడు.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ధాటిగా ప్రకటించారు. దీంతో నిరుద్యోగ టీచర్లలో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా నిరుద్యోగులను వంచించకుండా డీఎస్సీలు నిర్వహించిన వైనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎలిమెంటరీ తరగతులను హైస్కూళ్లలో కలపడం లాంటి రకరకాల ప్రయోగాలతో అనేక స్కూళ్లను మూసివేయించారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడ, భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేలాగా.. ప్రెవేటు స్కూళ్లలో చదివేవారికి కూడా.. అమ్మఒడి డబ్బులు అందిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఉపాధ్యాయ లోకం భవిష్యత్తు ఎలా ఉంటుందో అని పలువురు భయపడుతున్నారు. ఉపాధ్యాయవర్గాలపై జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పగబట్టినట్టుగా అనేక నిబంధనలు విధించి వారిని యాతనకు గురిచేస్తున్నారు. అదే సమయంలో వారిమీద ఒత్తిడి పెంచుతున్నారు. ఆ వర్గంలో తనపట్ల వ్యతిరేకత ఉన్నదని తెలిసి వారిని ఎన్నికల విధుల్లో పాల్గొననివ్వకుండా చూడాలని ఆయన కుట్ర చేశారు గానీ.. ఆ పాచిక పారలేదు. ఈసీ ఉద్యోగులు ఉండాల్సిందే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కనీసం నిరుద్యోగ టీచర్లనైనా మాయ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఇవన్నీ ఆయన పతనాన్ని శాసించే పరిణామాలే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.