వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నెగ్గడానికి రకరకాల కుయుక్తులు ప్రయోగించడం.. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలను ఆశ్రయించడం అనేది కొత్త కాదు. కడపజిల్లాలో తొలిసభ జరిగింది గనుక.. ఆ జిల్లాల్లో తన కుటుంబానికి ఎలాగైతే ఆదరణ ఉంటుందో.. అలాగే తన చిన్నాన్న వివేకానందరెడ్డి కి కూడా ఆదరణ ఉంటుంది గనుక.. అక్కడ ఆయన హత్యకేసును ప్రస్తావించారు. హత్య చేసిన వారికి చంద్రబాబు అండ్ కో అండగా ఉన్నారంటూ.. చిన్నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసు.. అంటూ.. చాలా తమాషాగా మాట్లాడారు జగన్. అయితే.. ఈ మాటల మీదనే వివేకా కూతురు సునీత ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు.
సునీత చాలా లాజికల్ స్ట్రెయిట్ ప్రశ్నను జగన్ కు సంధించారు. చంపినవాడు, చంపానని స్వయంగా ఒప్పుకున్న వాడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని జగన్ మొన్నటి సభలో చెప్పిన సంగతి తెలిసిందే. దస్తగిరికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నాడన్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు జగన్. సునీత సరిగ్గా ఆ పాయింట్ మీదనే తన ప్రశ్నను సంధించారు. దస్తగిరి చంపానని చెప్పిన విషయాన్ని నమ్ముతున్నప్పుడు.. చంపించినది అవినాష్ రెడ్డే అనే మాటను ఎందుకు నమ్మడం లేదని ఆమె జగన్ ను అడిగారు. చంపించిన వాడికి మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చి కాపాడుతున్నావా అంటూ ప్రశ్నించారు.
తన తండ్రి హత్యలో తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, దానివల్ల అందరినీ కోల్పోవాల్సి వచ్చినా వెనకాడేది లేదని, అదే సమయంలో జగన్ మాత్రం చిన్నాన్న హత్యను అయిదేళ్ల తర్వాత కూడా తన రాజకీయం కోసం, పదవులకోసం వాడుకోవాలని చూస్తున్నారని సునీత ఆరోపించారు.
వివేకానందరెడ్డి రక్తంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు తడిచిపోయాయని, అలాంటి పార్టీకి ప్రజలు ఎవ్వరూ ఓటు వేయవద్దని సునీత పిలుపు ఇవ్వడం విశేషం. చిన్నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసు అని నాటకీయంగా ఒక ప్రకటన చేయడం ద్వారా ప్రజలందరినీ నమ్మించేస్తున్నానని జగన్ అనుకోవచ్చు గానీ.. కడప జిల్లాల్లో ప్రత్యేకించి వివేకానందరెడ్డిని అభిమానించేవాళ్లు ఉంటే గనుక.. ఆ ఓటు బ్యాంకు మొత్తం ఈసారి జగన్ కు వ్యతిరేకంగా పడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి బహుశా చెల్లెలి వైపు నుంచి ఇలాంటి దాడి ఉంటుందని ముందే పసిగట్టారేమో తెలియదు గానీ.. దానికి తగ్గట్టుగా.. ఇప్పుడు నావాళ్లని కూడా నామీదికి ఎగదోస్తున్నారు. నా చెల్లెళ్లను నా మీదికి ప్రయోగిస్తున్నారు.. అని చంద్రబాబు మీదికి నెట్టడానికి ప్రయత్నించారు.