డ్రగ్స్ & డబ్బు : జగన్ చుట్టూ రెండు వివాదాలు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు రెండు వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ రెండు వివాదాలూ రెండు కంటైనర్ లకు సంబంధించినవి. ఒక కంటైనర్ డబ్బు తరలింపునకు వాడుతున్నదిగా వార్తలు ప్రచారం అవుతోంటే.. రెండో కంటైనర్ డ్రగ్స్ దిగుమతికి వాడినది! ఈ రెండు వివాదాలనుంచి ముఖ్యమంత్రి ఎలా బయటపడుతారనేది ప్రజల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశంగా ఉంది.

విశాఖకు చేరుకున్న డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు పూర్తిగా చుట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.

బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన డ్రగ్స్ దందా ఎంత సీరియస్ నేరమో అందరికీ తెలుసు. ఏకంగా సీబీఐ ఈ విషయంలో దర్యాప్తు చేస్తోంది. పార్సెల్స్ లో ఉన్న శాంపిల్స్ తీసి నార్కోటిక్ పరీక్షలకు పంపారు. ఒకవైపు సంధ్యా ఆక్వా వ్యవహారం చాలా అనుమానస్పదంగా ఉంది. బస్సులో ఫైళ్లు, హార్డ్ డిస్కుల తరలింపు వ్యవహారం ఒక అనుమానం పుట్టిస్తోంది. సంధ్యా ఆక్వా యజమానులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఉన్న అనుబంధం బట్టబయలు అవుతోంది. తమ పార్టీకి చుట్టుకున్న డ్రగ్స్ దందాను తెలుగుదేశం మీదికి బిజెపి మీదికి నెట్టడానికి వారు నానా తంటాలు పడుతున్నారు. తమ పార్టీనుంచి వెళ్లిపోయిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు సంబంధం ఉన్నట్టుగా ప్రచారం చేసేసరికి ఆయన పరువునష్టం దావా వేసేందుకు సిద్ధం అవుతున్నారు. బిజెపి సారథి పురందేశ్వరి కూడా పరువునష్టం దావా వేస్తున్నారు. జగన్ ప్రత్యేకించి పురందేశ్వరికి ముడిపెట్టడానికి చూస్తున్నారు.

అసలే జగన్ అండ్ కో డ్రగ్స్ కంటైనర్ ఇబ్బందుల్లో ఉంటే .. జగన్ ఇంటికి ఒక కంటైనర్ వెళ్లడం.. అందులోంచి డబ్బు కట్టలు నింపిన అట్టడబ్బాలను బయటకు తరలించారనే వార్తలు బయటకు రావడం ఇప్పుడు మరో సంచలనం. ఒక డ్రగ్స్ కంటైనర్ తోనే జగన్ దళం సతమతం అవుతుండగా.. మరో డబ్బు కంటైనర్ వారి ప్రాణాల మీదికి వచ్చింది. జగన్ బస్సుయాత్రలో వాడే వంటపాత్రలను తీసుకువెళ్లడానికే కంటైనర్ వచ్చిందని ఆ పార్టీ నాయకులు చెబుతుండడం మరీ కామెడీగా ఉందని ప్రజలు అంటున్నారు. ఆ కంటైనర్ తాడేపల్లి నుంచి విజయవాడ బస్సుస్టాండు అడ్మిన్ బ్లాక్ ముందు ఆగిందని, అందులోంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టెపెట్టెలను కొందరు లోనికి ఒక అధికారి వద్దకు తీసుకువెళ్లారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి క్యాష్ స్మగ్లింగ్ కు వాడుకుంటున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రెండు రకాల కంటైనర్లు, రెండు రకాల వివాదాలతో జగన్ అండ్ కో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories