వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అయిదు సంవత్సరాలు గడచిపోయాయి. ఇప్పటిదాకా ఆ కేసు అతీగతీ తేలలేదు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఈకేసును చూస్తోంది. అయినా సరే.. ఏ సంగతీ తేలలేదు.
ఒకవైపు నిన్న గాక మొన్న బయటకు వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు ఎంత వేగంగా జరుగుతున్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత తదితరులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కానీ.. అయిదేళ్ల కిందటి వివేకా హత్యహత్యవ్యవహారం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నదని సీబీఐ అంటున్నప్పటికీ.. వ్యవహారం తేలడం లేదు. అయితే ఎన్నికలు రావడంతో.. వివేకానందరెడ్డి హత్య కేసు అనేది ఇరు పార్టీలకు కడప జిల్లాకు సంబంధించినంత వరకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన బస్సుయాత్ర తొ లిరోజు కడపజిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో..
‘చిన్నాన్న హత్య కేసు’ను ప్రస్తావించారు. ఆ కేసును అన్యాయంగా తన మీదకు నెట్టాలని చూస్తున్నారని ఆయన వాపోయారు. ఇంతకూ జగన్ ఏం చెప్పారంటే.. ‘‘వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆహంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. జైల్లో ఉండాల్సిన చంపినోడికి మద్దతు ఇస్తున్నది చంద్రబాబు, ఆయన తరఫున ఎల్లో మీడియా మాత్రమే. రాజకీయ లబ్ధికోసం తపించిపోతున్న నా వాళ్లు. చిన్నాన్నను అన్యాయంగా చంపి రాజకీయంగా నాపై నెట్టేస్తున్నారు. ఇంత దారుణం చేస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? ఆ దేవుడు, ప్రజల్ని, ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్నా’’ అన్నారు.
ఇక్కడ ప్రజలకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. చంపానని స్వయంగా చెప్పినవాడు బయట తిరుగుతున్నాడంటూ జగన్, దస్తగిరి గురించి ఆక్రోశిస్తున్నారు.. నిజమే! కానీ దస్తగిరి చెప్పిన ఆ మాటను నమ్మినప్పుడు.. అదే దస్తగిరి చెబుతున్నట్టుగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పాత్ర ఉన్నదని అంటే జగన్ ఎందుకు నమ్మడం లేదు? అనేది ఒక ప్రశ్న.
ఇప్పటిదాకా జగన్ మీదకు నేరాన్ని ఎవ్వరూ నెట్టే ప్రయత్నం చేయలేదు. అటు దస్తగిరి గానీ, సునీత షర్మిల గానీ, చంద్రబాబు గానీ చేయలేదు. చంపించిన అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మాత్రమే జగన్ వైపు వేలెత్తి చూపారు. కానీ జగన్ ‘నామీదకు నెడుతున్నారు’ అనడం ద్వారా బుజాలు తడుముకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నానని జగన్ అంటున్నారు. నిజానికి ఆయన హంతకుల్ని కాపాడుతున్నాడని ఆరోపిస్తున్న వారు కూడా.. వాటినే నమ్ముకున్నాం అని చెప్పి పోరాడుతుండడం విశేషం.
చిన్నాన్న హత్య గురించి కడప జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటిది అక్కడ ఈ విషయం ప్రస్తావించి, తన నోటితో తానే అబద్ధాలు చెబుతున్నట్టుగా అందరికీ కనిపించారు. జగన్ మాటలను జిల్లాలోని జనం ఈసడించుకుంటున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టుగా ఉన్న .. జగన్ మాటలను విన్న ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జరిగిన చిన్నాన్న హత్య కంటె.. జగన్ చెబుతున్న ఈ అబద్ధాలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం చేయబోతున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.