విజయమ్మ షర్మిల వెంట ఉంటున్నారా? లేదా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ‘షర్మిల ఫోబియా’ చాలా బలంగా ఉంది. తన పార్టీమీద, ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా తన మీద షర్మిల చేస్తున్న సూటి విమర్శలు, తనను ఎండగడుతున్న తీరు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, తనతో సమానంగా వైఎస్ అభిమానుల్లో ఆమెకు ఉండే ఆదరణ ఇవన్నీ కలిసి తన పార్టీకి ఈ ఎన్నికల్లో చేటు చేస్తున్నాయని ఆయన భయపడుతున్నట్టుగా ఉంది. అందుకే ఆయన వీలైనంత నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం తనకు మాత్రమే ఉన్నదని బిల్డప్ ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్లుగా కన్నతల్లిని కూడా దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి.. బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా ఆమెను ఇడుపులపాయకు పిలిపించి… తండ్రికి నివాళు ఇచ్చే చోట ఆమెను కూడా పక్కన ఉంచుకున్నారు. తద్వారా ‘వైఎస్సార్ అభిమాన ఫ్యాక్టర్’ పూర్తిగా తనకే దక్కాలని ఆయన కోరుకుంటున్నట్టుగా ఉంది.

ఈ నేపథ్యంలో విజయమ్మ, తనకుమార్తె షర్మిల వెంట, ఆమె రాజకీయ ప్రస్థానంలో  అండగా ఉండబోతున్నారా? లేదా? అనే సందేహం ఇప్పుడు పలువురిలో తలెత్తుతోంది. షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని, అక్కడ రాజకీయం చేయడం ప్రారంభించిన తర్వాత.. ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితులు పూర్తిగా మారాయి.

విజయమ్మ ఆ పార్టీకి దూరంగా ఉండిపోయారు. కొన్నాళ్ల కిందట పార్టీ ప్లీనరీకి వచ్చిన ఆమె తొలి సభలోనే.. తనకు కుమారుడు కట్టబెట్టిన ‘వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష’ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు కొడుకుకు అండగా ఉన్నానని, ఇప్పుడు కూతురు షర్మిలకు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందని, ఇక ఆమె వెంటే రాజకీయంగా ఉంటానని విజయమ్మ పలుసందర్భాల్లో పేర్కొన్నారు.

ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల్లోకే వచ్చి జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసించే దిశగా చాలా చురుగ్గా కదులుతున్నారు. మరి ఇప్పుడు కూడా విజయమ్మ కూతురు వెంట రాజకీయ అండగా, పెద్దదిక్కుగా ఉండబోతున్నారా లేదా? అనేది ప్రశ్న! జగన్ ప్రచారం ప్రారంభం సమయంలో ఆమె కూడా కనిపించడంతో ఈ సందేహాలు ఇంకా పెరుగుతున్నాయి. అయితే జగన్ తల్లిని బలవంతంగా ఒప్పించి ఇడుపులపాయ తీసుకువచ్చారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తొలిరోజు ప్రచార సభలో కూడా పాల్గొనాల్సిందిగా జగన్ తల్లిని కోరినప్పటికీ.. ఆమె ఒప్పుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. షర్మిల విషయంలో ఆమె స్వయంగా ప్రచార సభల్లో కూడా కూతురు వెంట పాల్గొనే అవకాశం ఉన్నదని అంచనాలు సాగుతున్నాయి. జగన్ కుటుంబరాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories