కాషాయం తిరుగుబాటును కమలం బుజ్జగించాల్సిందే!

భారతీయ జనతాపార్టీ ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం- జనసేనలతో కలిసి పోటీచేస్తోంది. రాష్ట్రంలో గత ఎన్నికల నాటికి ఒక్కశాతం ఓటు బ్యాంకు మాత్రమే కలిగి ఉన్న బిజెపి ఇప్పుడు ఏకంగా ఆరు ఎంపీసీట్లను, పది ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుని బరిలో నిలుస్తోంది. అందవరకు తెలుగుదేశం- జనసేన వారికి గౌరవప్రదంగా వాటా ఇచ్చినట్టే లెక్క. అయితే బిజెపి నాయకులు కూడా అంతే స్థాయిలో పూర్తిగా మిత్రపక్షాలకు సహకరించాల్సి ఉంది. కానీ వ్యవహారం అలా కనిపించడం లేదు. ఆ పార్టీ తరఫున హిందూపురం ఎంపీ టికెట్ ఆశించిన స్వామి  పరిపూర్ణానంద ఇప్పుడు ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతున్నా అంటున్నారు.

బిజెపి హిందూపురం సీటును ఆశించినట్టుగా వార్తలు వచ్చాయి. మొత్తానికి సీట్ల పంపకాల్లో భాగంగా వారు కోరినట్టు ఆరు స్థానాలను  దక్కించుకున్నారు. అందులో హిందూపురం లేదు. రాజకీయ ఆసక్తి మెండుగా ఉండే ఈ కాషాయస్వామి పరిపూర్ణానంద ఇప్పుడు ఆగ్రహించారు. ఉంటే గింటే ఆరు స్థానాల్లో ఆయనకు అవకాశం ఇవ్వని బిజెపి పార్టీ మీద ఆయనకు ఉండాలి. అయితే ఆయన చంద్రబాబును నిందిస్తున్నారు.

తనకు టికెట్ దక్కకుండా చంద్రబాబునాయుడు అడ్డు పడుతున్నారని అంటున్నారు. తనకు టికెట్ ఇస్తే ముస్లింఓట్లు తెలుగుదేశానికి పడవు అని ఆయన అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ఓట్ల కోసం చంద్రబాబు 85 శాతం హిందువుల ఓట్లను పణంగా పెట్టారని ఆరోపిస్తున్నారు. అందువల్ల తాను ఇండిపెండెంటుగా పోటీచేయడానికి నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. తమాషా ఏంటంటే.. టికెట్ వస్తే ఆయన బహుశా ఎంపీగా మాత్రమే పోటీచేసేవారేమో. ఇప్పుడు ఎంపీ మరియు ఎమ్మెల్యే రెండు స్థానాలకు పోటీచేస్తా అంటున్నారు.

బాలకృష్ణ వంటి కీలక నాయకుడు పోటీచేస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి అసంతృప్తి పోటీలు ఉండకుండా బుజ్జగించాల్సిన బాధ్యత బిజెపి పెద్దలమీదనే ఉన్నదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కమలదళం నాయకులు నియోజకవర్గాల్లో కూటమితో ఇంకా సఖ్యంగా తయారు కావడం లేదు. పైగా పరిపూర్ణానంద వంటి వారు తిరుగుబాటు చేస్తాం అంటున్నారు. ఆయనను బిజెపిలో గతంలో తెలంగాణలో కూడా ఆశపెట్టి వాడుకుంది. ఏకంగా సీఎం అభ్యర్థి అని చెప్పింది. ఆయన గెలవనేలేదు. కాకపోతే ఇప్పుడు ఏపీలో పొత్తుల కూటమికి ముసలంలా తయారవుతున్నారు. ఇలాంటి అసమ్మతులు కేవలం పరిపూర్ణానందతో ముగిసిపోలేదు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి లేఖ రాసిన బిజెపి నాయకులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా బుజ్జగించి కూటమికి అనుకూలంగా ప్రచారంలోకి తీసుకురావడం బిజెపి బాధ్యత అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అందులో వారు ఏ మేర సక్సెస్ అవుతారో??

Related Posts

Comments

spot_img

Recent Stories