పోలీసులు ఊరుకున్నా.. శివుడు వదిలిపెడతాడా?

శివుడు అంటేనే లయకారుడు. అలాంటి నిత్యం శివపూజలో గడుపుతూ.. తమ జీవితాలను భగవత్సేవకు అంకితం చేసుకున్న పూజారుల అమర్యాదగా ప్రవర్తించడాన్ని మనం అసలు ఊహించుకోగలమా? అసలు గుడిలోని పూజారి  అంటేనే మనం దేవుడి ప్రతినిధిగా భావిస్తాం. కాళ్లు మొక్కి మన భక్తిని ప్రదర్శిస్తాం. అలాంటిది ఎంతటి మదాంధులు అయినప్పటికీ, అధికార అహంకారంతో కనులు మూసుకుపోయినప్పటికీ.. గుడిపూజారిని తన్నడాన్ని మనం ఊహించగలమా? కానీ, అదే జరిగింది. కాకినాడలోని ఒక శివాలయంలో అధికార పార్టీలోని ఒక మాజీ కార్పొరేటర్ నిర్వాకం ఇది. ఆయన చేతిలో చెంపలు పగలగొట్టించుకుని, తన్నులు తిని, ఆయన నోటమ్మట బూతులు పడి పూజారులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవచ్చు గాక. కానీ.. లయకారుడు అయిన శివుడు పట్టించుకోకుండా ఉంటాడా?

కాకినాడలోని దేవాలయం వీధిలో ఒక పురాతన శివాలయం ఉంది. ఫాల్గుణ పౌర్ణమి కావడంతో సోమవారం భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్ , వైకాపా నేత సిరియాల చంద్రరావు కూడా గుడికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చారు. అంతవరకు ఆయనకు లాంఛనప్రాయమైన అధికార మర్యాదలు అన్నీ బాగానే జరిగాయి. అయితే ఆయన ఇచ్చిన సామగ్రిని అందుకుని.. పూజలో నిమగ్నం అయిన పూజారి వెంకటసత్యాసాయి.. తాను తెచ్చిన పాలను శివలింగంపై ‘సరిగ్గా పోయలేదని’ సిరియాల చంద్రరావుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా.. అంటూ ఊగిపోయారు. పూజారి ప్రసాదం ఇస్తున్న సమయంలో లాగిపెట్టి ఆయన చెంపపై కొట్టారు. ఎందుకని అడిగేలోగా, నన్నే ప్రశ్నిస్తావా అంటూ మళ్లీ కొట్టారు. ఈ అరుపులు విని పక్కన ఉపాలయంలో ఉన్న మరో పూజారి వచ్చి ఎందుకని అడగబోతే ఆయనను కూడా కొట్టారు. తమాషా ఏంటంటే.. అధికార పార్టీ నేత చేతిలో తన్నులు తిన్న పూజారులు తమ గోడు చెప్పుకోవడానికి వెళితే.. దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దాటవేయడానికి ప్రయత్నించారు. నా పరిధిలోది కాదు.. మరొకరికి చెప్పుకోండి అంటూ నాటకాలు ఆడబోయారు. అయితే పూజారులు ఆందోళన చేయడంతో చివరికి దిగిరాక తప్పలేదు. గుడివద్దకువచ్చి వివరాలు తెలుసుకున్నారు.

భక్తులందరి సమక్షంలోనే ఆలయంలో జరిగిన ఈ అహంకార ప్రదర్శన మీద.. పూజారులు ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా మీనమేషాలు లెక్కించారు. చివరికి విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగిమీద దాడి చేసిన సెక్షను కింద కేసు పెట్టారు. అయితే ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ.. ఆ ఫుటేజీ బయటకు రాకుండా మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నదని తెలుస్తోంది. కేసు వెనక్కు తీసుకోవడానికి పూజారులమీద ఒత్తిడి తెచ్చేలా వైకాపా పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఊరుకున్నా, తన భక్తులను ఇలా చేసినందుకు శివుడు ఊరుకుంటాడా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories