ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో నాలుగేళ్లకుపైగా అలుపెరగకుండా సాగుతున్న పోరాటానికి తాత్కాలికంగా విరామం వచ్చింది. అమరావతి కోసం తుళ్లూరు వద్ద శిబిరాలు వేసుకుని సాగిస్తున్న సమష్ఠి దీక్షలకు ఆందోళనకారులు, రైతులు విరామం ఇచ్చారు. కరోనా లాక్ డౌన్ సమయంలో చేసినట్టుగా.. తమ తమ ఇళ్ల వద్దనుంచే నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల.. పోలీసుల సూచనలమేరకు శిబరాల్లో దీక్షలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు.
అయితే.. అమరావతి దీక్షలకు తాత్కాలికంగా విరామం వచ్చి ఉండొచ్చు గానీ.. ఈ విరామం శాశ్వతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికల తర్వాత.. అమరావతి రైతులు, రాజధానిని ప్రేమించే వారు మళ్లీ రోడ్డెక్కే అవసరమే ఏర్పడకూడదు అనే అభిప్రాయం, కోరిక ప్రజల్లో ఉంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అమరావతి రాజధాని అనే రాష్ట్ర ప్రజల స్వప్నాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. ఆయన గద్దె ఎక్కిన వెంటనే.. ప్రజావేదికను కూల్చేయడంతోనే విధ్వంసక పాలన ప్రారంభించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి అనే మాయమాటలు చెబుతూ.. మూడు రాజధానుల కాన్సెప్టును తెరమీదకు తెచ్చారు. ఆ మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతి కూడా ఉన్నప్పటికీ.. కనీసం అక్కడ సగం పూర్తయిన పనులను కూడా కొనసాగించలేదు. 70-80 శాతం పూర్తయిన పనులను కూడా గాలికొదిలేసి.. మొత్తం అమరావతి ప్రాంతాన్నే శిథిల స్మశానంలాగా మార్చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి అనే అద్భుతమైన రాజధాని కోసం యాభై వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు, ప్రజలు దీక్షలకు దిగి, న్యాయపోరాటం చేసి విజయం సాధించారు కూడా. అమరావతిని మాత్రమే రాజధానిగా అభివృద్ధి చేయాలని, ఒక్క కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించడానికి వీల్లేదని హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినా.. జగన్ పట్టించుకోలేదు. తన మొండి వైఖరిని కొనసాగిస్తూ వచ్చారు.
ఈలోగా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎన్డీయే కూటమి విజయం సాధించి..
అమరావతి కలల రాజధానికి రూపకల్పన చేసిన చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఆశలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి. తెలుగుదేశం సర్కారు ఏర్పడిన వెంటనే.. అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతాయని లోకేష్ ఆల్రెడీచెప్పిన మాట వారికి ఆశలు పుట్టిస్తోంది. అందుకే ఇప్పుడు కోడ్ వల్ల సమష్టి దీక్షలకు విరామం ఇచ్చినా.. ఈ విరామం శాశ్వతం కావాలని వారు కోరుకుంటున్నారు.