సజ్జలపై ఈసీ వేటు!

ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారు, సకలశాఖా మంత్రిగా ప్రతిపక్ష నాయకులు ముద్దుగా పిలుచుకునే సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద ఎన్నికల కమిషన్ చర్య తీసుకోబోతున్నదా? ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తూ, ప్రభుత్వం నుంచి సొమ్మును వేతనంగా తీసుకుంటూ.. రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు, రాజకీయ భేటీలు, సభలలో పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నందుకు- కేబినెట్ హోదా కలిగిన  ఆయన ‘సలహాదారు’ పదవి మీద ఎన్నికల సంఘం వేటు వేయడానికి ఉద్యుక్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ ఆయన నిర్వహిస్తున్న రాజకీయ కార్యకలాపాల మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా విమర్శలు చేస్తున్నారని సీఈఓకు లేఖరాశారు.

అయిదేళ్లుగా ప్రభుత్వ సలహాదారులాగా కాకుండా, వైకాపా కార్యకర్తలాగా సజ్జల పనిచేస్తున్న తీరును అచ్చెన్నాయుడు తన ఫిర్యాదులో ఎండగట్టారు. ప్రస్తుతం ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందువల్ల.. ఆయన రాజకీయ ప్రకటనలు తగవని కానీ, కోడ్ ను ఉల్లంఘిస్తూ 18, 22 తేదీల్లో ప్రతిపక్షాలమీద విమర్శలు చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్లను ఆయన ఉదాహరించారు. వైసీపీ నాయకులతో భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు చేస్తున్నారంటూ ఆధారాలను జతపరిచారు.

ఎన్నికల సంఘం కోడ్ నుఅతిక్రమించిన అధికారుల మీద కఠినంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నందున సలహాదారు కూడా అధికారుల కిందికే వస్తారని, వారి మీద కూడా ఈసీ వేటు వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీసుకునే స్వల్ప మొత్తం గౌరవవేతనమే అయినప్పటికీ..

వాలంటీర్ల రాజకీయ కార్యకలాపాలపై కూడా నిషేధం విధించి.. వారిమీద వేటు వేస్తున్న ఎన్నికల సంఘం.. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. ప్రభుత్వ అధికారిక సదుపాయాలు అన్నీ పొందుతూ రాజకీయ నాయకుడిలాగానే ప్రవర్తిస్తున్న  సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద కూడా తప్పకుండా వేటు వేస్తుందనే అభిప్రాయమే పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వచ్చేశాక ఈ సలహాదారు పదవి ఉంటే ఎంత పోతే ఎంత.. రాజకీయంగా పూర్తిస్థాయిలో పనిచేస్తూ మళ్లీ పార్టీని గెలిపించుకోవడమే ముఖ్యంగానీ.. అన్నట్టుగా సజ్జల కూడా బరితెగించినట్టు కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories