క్విడ్ ప్రోకో అనే పదం ఇవాళ తెలుగు ప్రజలకు తెలిసివచ్చింది అంటే.. అందుకు ఆద్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సామాన్యుల ఊహకు కూడా అందని విధంగా.. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అడ్డగోలుగా దందాలు సాగించి లక్షల కోట్లు కాజేసిన కేసుల్లో జగన్ ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు. నీకు అది- నాకు ఇది అంటూ ప్రభుత్వ ఆస్తులను లోపాయికారీగా దోచిపెట్టిన వ్యవహారాలు ఇంకా కోర్టుల్లో నలుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ క్విడ్ ప్రోకో అనే వ్యవహారానికి సరికొత్త రూపం ఇస్తున్నారు. వేల ఎకరాల భూములను తన పార్టీ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థికి కారుచవకగా ధారాదత్తం చేస్తున్నారు. అందుకు ప్రతిగా.. ఏమేం ఆశిస్తున్నారో అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీచేస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలకు జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రంలో ఉన్న భూములన్నీ దోచిపెడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చలమలశెట్టి సునీల్ కు చెందిన గ్రీన్ కోకు గత అయిదేళ్లలో ఏకంగా 7047 ఎకరాలు ధారాదత్తం చేసేశారు. ఎన్నికల ప్రకటన వస్తుందని తెలిసిన ముందురోజు కూడా ఏకంగా 1985 ఎకరాలు కేటాయించేశారు. ఇవన్నీ కూడా ఎకరా కేవలం రూ.5లక్షల వంతున ఇవ్వడం జరిగింది.
ఈ లెక్కన ఒక్క చలమలశెట్టి సునీల్ కే వందల కోట్ల వేలకోట్ల రూపాయల విలువైన ప్రభుత్వాస్తులను అడ్డదారుల్లో కారు చవకగా కట్టబెట్టేసినట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఎంపీ స్థానానికి ఆర్థికంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపినప్పుడు.. ఆయన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిధులు ఏర్పాటు చేయాలని వారికి పురమాయిస్తుండడం కద్దు. గత ఎన్నికల్లో ఆ రకంగా నరసాపురం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తన వద్ద డబ్బు తీసుకున్నారని రఘురామక్రిష్ణ రాజు ఆరోపించారు కూడా. ఇప్పుడు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు దోచిపెడుతున్న వైనం గమనిస్తే.. రాష్ట్రం మొత్తం అందరికీ నిధులు సరఫరాచేసే బాధ్యత ఆయనకు ఇచ్చారేమో అన్నంత అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. కోడ్ రావడానికి ముందురోజున జరిగిన ఈ భారీ భూ కేటాయింపుల మీద కోర్టుకు వెళ్లడానికి కొందరు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.