తమ పార్టీనుంచి ఎవ్వరైనా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తే చాలు.. ఆ నాయకుడు ఎందుకూ పనికిరాని చెత్త అనీ.. ఒక చోట చెల్లని నాణెం మరొకచోట చెల్లుతుందా? అని.. ఆ నాయకుడు వెళ్లిపోవడమే తమకు చాలా మంచిదని..
అవకాశవాదంతో ఎన్నికల్లో టికెట్ కోసం ఆ పార్టీలోకి వెళ్లాడని.. ఇలా రకరకాలుగా పార్టీలు వ్యాఖ్యానిస్తుంటాయి.
కానీ టికెట్ల కేటాయింపు అనే పర్వం మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా.. ఒక పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయంటే.. ఎలాంటి హామీల గురించిన హామీలు తీసుకోకుండానే, టికెట్ మీద ఆశతో సంబంధమే లేకుండా నాయకులు వేరే పార్టీలో చేరుతున్నారంటే ఆ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ చేరికల యొక్క అర్థం ఒకే ఒక్కటి. ప్రస్తుతం తాము ఉన్న పార్టీ ఎన్నికల్లో నెగ్గుతుందనే నమ్మకం వారికి లేదని మాత్రమే!
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం ఆదివారం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఒక కీలక నాయకుడు తెలుగుదేశంలో చేరారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కెఇ కలిసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఏ సాధారణ నాయకుడో అయితే ఇంత పెద్ద చర్చలేదు. జగన్ మంత్రి వర్గంలో కీలక నాయకుడు, అయిదేళ్లుగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న బుగ్గన రాజేంద్రనాధ రెడ్డికి స్వయానా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. అందువల్లనే ఆ చేరిక బహుధా చర్చనీయాంశం అవుతోంది. చిన్న బుగ్గన చేరిక తెలుగుదేశానికి బలం మాత్రమే కాదు.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతున్నదనడానికి కూడా సంకేతం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొన్నమొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ ను విడిచిపెట్టి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారంటే వారి మీద బోలెడు నిందలు వేశారు. అవకాశవాదులు అని అన్నారు. కానీ అన్ని పార్టీల్లోనూ టికెట్ల ఎంపిక కూడా పూర్తయిపోయిన తర్వాత.. ఇప్పుడు ఎవరైనా వెళుతున్నట్లయితే దాని అర్థం ఏమిటి? వారిని ఏమనాలి? వారిని ‘జాగ్రత్త పరులు’ అని అనాలి. అలాంటి వారు పార్టీ వీడి వెళ్లిపోతున్న ఉదంతాల నుంచి జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే నష్టపోయేది కూడా ఆయనే.