కాణిపాకం వినాయకుడి సాక్షిగా.. పొలిటికల్ దందా!

ఏ దేవుడి ఎదుట చిన్న తప్పు చేసినా సరే.. తమ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుందని అందరూ భయపడుతూ ఉంటారో.. అలాంటి దేవుడి సన్నిధినే రాజకీయ అవసరాలకు వాడేసుకోవడం ఇప్పుడు బహుధా వివాదాస్పదం అవుతోంది. ఆలయాలలో ఎన్నికల ప్రచారం అనేదే నిషిద్ధం, నిబంధనలకు విరుద్ధం కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజూ ఏదో ఒకచోట ఆలయాల్లో నిర్వహిస్తున్న ప్రచారాల దృశ్యాలు మనకు పత్రికల్లో కనిపిస్తూనే ఉన్నాయి. కాణిపాకంలో ఒక అడుగు ముందుకు వేసి.. ఆలయ సిబ్బందితోనే.. ఎన్నికల ప్రచార సామగ్రిని గుడికి వచ్చిన వినాయకుడి భక్తులకు పంచే ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

కాణిపాకం వినాయకుడు ప్రమాణాల దేవుడుగా ప్రసిద్ధి. ఆయన ఆలయంలో ప్రమాణం చేసి, దానికి విరుద్ధంగా తప్పు చేయాలంటే.. ఎవ్వరైనా భయపడిపోతారు. అక్కడ ప్రమాణం చేసి అబద్ధం కూడా చెప్పరు. అలా చేస్తే తమ జీవితం నాశనం అవుతుందని అందరికీ ఒక నమ్మకంతో కూడిన భయం. కానీ, అధికార పార్టీకి చెందిన నాయకుల బొమ్మలు ఉన్న బుక్ లెట్ లను, కరపత్రాలను ఆలయ కౌంటర్ల వద్ద భక్తులకు దేవస్థానం సిబ్బందే పంచిపెట్టడం ఆదివారం చోటు చేసుకుంది.

గుడి సిబ్బందే నిబంధనలను మీరి ఇలా బరితెగించి ఎన్నికల ప్రచార సామగ్రిని భక్తులకు పంచిపెట్టవచ్చు గాక.. కానీ పుచ్చుకునే భక్తుల్లో ప్రతి ఒక్కరూ వైసీపీ వారే ఉండరు కదా.! ఆగ్రహించిన భక్తులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సంగతి తెలియగానే సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన బుక్లెట్లు అన్నింటినీ గోడౌన్ కు తరలించారు.

చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. గతంలో కుప్పంలో కూడా ఇలాంటి వ్వవహారమే చోటుచేసుకుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో ఆలయ ఉన్నతాధికారి ప్రచారం చేశారని తెలిసి ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అసలు నిబంధనలను ఖాతరు చేయకుండా, అధికార పార్టీ బుట్టదాఖలు చేస్తోంది.

విచ్చలవిడిగా గుడులు, ప్రార్థన స్థలాల్లో ప్రచారం చేస్తున్నారు. అడిగే దిక్కులేదు. చర్యలు తీసుకునే వారు లేరు.
వాటిని మించి కాణిపాకం ఆలయంలో.. ఏకంగా సిబ్బందే ప్రచారానికి దిగడం పట్ల ఈసీ సీరియస్ అయిందని, ఎన్నికల అధికారి ద్వారా విచారణకు ఆదేశించనున్నారని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories